‘పిట్‌బుల్‌’ బీభత్సం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు | 6 Month Old Critical After Pit Bull Attack In Haryana Sonipat | Sakshi
Sakshi News home page

‘పిట్‌బుల్‌’ బీభత్సం.. సీసీటీవీలో భయానక దృశ్యాలు

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:48 AM

6 Month Old Critical After Pit Bull Attack In Haryana Sonipat

కుక్కే కదా అనుకుంటే రెచ్చిపోతున్నాయి. అమాంతం మీదపడి దాడి చేస్తున్నాయి.  ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు.. ఇంటి ముందు ఆడుకునే పిల్లల నుంచి, దారిన పోయే పెద్దల వరకూ దాడి చేసి ప్రాణాలు తోడేస్తున్నాయి. హర్యానాలోని సోనిపట్‌లో పిట్‌బుల్ కుక్క దాడిలో ఆరు నెలల చిన్నారి తీవ్రంగా గాయపడింది. సిక్కా కాలనీలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్తున్న ఓ మహిళపై కుక్క ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. అనంతరం ఆ కుక్క.. చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. చిన్నారిని పిన్ని బయటకు నడకకు తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా పిట్‌బుల్ వారి వైపు పరుగెత్తుకొచ్చి చిన్నారిపై దూసుకెళ్లింది. చిన్నారిని కాపాడేందుకు మహిళ ప్రయత్నించినప్పటికీ.. కుక్క చిన్నారిని నోటితో పట్టుకోవడంతో ఆమె చేతుల్లో నుంచి చిన్నారి కిందపడిపోయింది.

కుక్క చిన్నారిని వదలకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. అక్కడున్న పలువురు వ్యక్తులు కుక్కను చిన్నారి నుంచి విడదీయడానికి ప్రయత్నించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని మెరుగైన చికిత్స కోసం రోహ్‌తక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, చిన్నారి కుటుంబం ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కుక్క యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించారా? ఇలాంటి జాతికి చెందిన కుక్కను ఇంట్లో పెంచేందుకు నిబంధనలు పాటించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనూ ఇదే తరహాలో ఢిల్లీలోని వినయ్ ఎన్‌క్లేవ్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కుడి చెవిలో కొంత భాగం తెగిపోవడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కుక్క యజమానిని హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 

ఇదీ చదవండి: హనీమూన్‌లో ఊహించని ప్రమాదం.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement