ఉద్యోగం నిరాకరించిన ఐఓసీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇది స్త్రీత్వాన్ని అవమానించడమేనంటూ ఘాటు వ్యాఖ్య
బాధితురాలికి రూ.12 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: మహిళలు గ్యాస్ సిలిండర్లు ఎత్తలేరని భావిస్తున్నారా? అంటూ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ అన్న ఏకైక కారణంతో ఆమెకు ఉద్యోగం నిరాకరించడం స్త్రీత్వాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌లో రీఫిల్లింగ్ హెల్పర్ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ లింగ వివక్షతో ఆ ఉద్యోగం కోల్పోయిన సుమిత్ర అనే బాధితురాలికి రూ.12 లక్షల పరిహారం చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పాంచోలీల ధర్మాసనం ఈ కేసును విచారించింది. హరియాణాలోని గుధా గ్రామానికి చెందిన సుమిత్ర ఐఓసీఎల్‌పై చేసిన సుదీర్ఘ న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. బాధితురాలు ఇప్పటికే పదవీ విరమణ వయసుకు చేరుకోవడంతో, ఆమెకు ఉద్యోగానికి బదులుగా రూ.12 లక్షల ఏకమొత్తం పరిహారంగా చెల్లించాలని ధర్మాసనం ఐఓసీఎల్‌ను ఆదేశించింది. సుమిత్ర తరఫు న్యాయవాది హిమాన్షు జైన్ వాదనలు విన్న అనంతరం ఐఓసీఎల్ వైఖరిని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.
‘కేవలం మహిళ అయినందుకే ఉద్యోగం నిరాకరిస్తారా?. ఇది స్త్రీత్వాన్ని అవమానించడమే. మనం భారతీయులం. ప్రతిరోజూ మహిళలను గౌరవించాలని, ఆమె ఒక దేవత అని చెబుతుంటాం. కానీ ఒక భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇలా వ్యవహరించడం దారుణం. మహిళలు తమ ఇళ్లలో ప్రతిరోజూ గ్యాస్ సిలిండర్లు ఎత్తుతూనే ఉంటారు. ఇంట్లో పురుషులు లేనప్పుడు సిలిండర్ మార్చేది మహిళే కదా’అని జస్టిస్ అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వానికి పంపాలని ఐఓసీఎల్ తరఫు న్యాయవాది కోరగా, ధర్మాసనం ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
రాత్రి షిఫ్టులు చేయలేరనే...
అంతకుముందు ఐఓసీఎల్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అధికారుల కమిటీ పంపిన జాబితా కేవలం సిఫార్సు మాత్రమేనని, దానికి చట్టపరంగా బద్ధమై ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. హెల్పర్ పోస్టులో ఉన్నవారు ఎల్పీజీ సిలిండర్లను ఎత్తాల్సి ఉంటుందని, రాత్రి షిఫ్టులు సైతం ఉంటాయని, ఈ శారీరక శ్రమకు ఆమె సరిపోదని అధికారులు భావించి ఉంటారని ఆయన వాదించారు.
అసలేం జరిగింది?
ఐఓసీఎల్‌కు చెందిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌లో ఉద్యోగాల కోసం డెప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని స్థానిక కమిటీ 49 మంది పేర్లను సిఫార్సు చేసింది. అందులో సుమిత్ర పేరు ఉంది. క్యాజువల్ ఖలాసీ, ప్యూన్, రీఫిల్లింగ్ హెల్పర్ పోస్టుల కోసం ఆమె ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కమిటీ సిఫార్సు చేసిన వారిలో 43 మందికి నియామక పత్రాలు అందజేసిన అధికారులు.. సుమిత్రకు మాత్రం ఉద్యోగం నిరాకరించారు. దీనిపై సుమిత్ర మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఆమెకు అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయని, కేవలం మహిళ అయినందునే ఉద్యోగం ఇవ్వలేదని ట్రయల్ కోర్టు విచారణలో తేలింది.
దీంతో ఆమెను కారి్మకురాలిగా కాకుండా పరిపాలనా విభాగంలో లేదా ప్యూన్‌గా నియమించాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును ఫస్ట్ అప్పీలేట్ కోర్టు కొట్టివేసింది. ఇంటర్వ్యూ చేయని పోస్టుకు ఆమెను ట్రయల్ కోర్టు ఎలా ఎంపిక చేస్తుందని, పైగా ఆమెకు ఎంపికయ్యే చట్టపరమైన హక్కు లేదని ఫస్ట్ అప్పీలేట్ కోర్టు తన తీర్పులో పేర్కొంది. పంజాబ్, హరియాణా హైకోర్టు సైతం 2025 అక్టోబర్ 14న ఫస్ట్ అప్పీలేట్ కోర్టు తీర్పును సమర్థిస్తూ సుమిత్ర పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆమె ఎట్టకేలకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచి్చంది.


