ఝార్ఖండ్‌లో 36 ఏళ్ల ఓ మహిళ హత్యకు గురైనట్లు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, సుమారు 20 రోజుల తర్వాత గుజరాత్‌లోని సూరత్‌లో ఆమె సురక్షితంగా కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన వీడియోలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించారు. అనంతరం సూరత్ సచిన్ జీఐడీసీ పోలీసులు ఆమెను గుర్తించి ఝార్ఖండ్ పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లా ఖలారీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. టండ్వా ప్రాంతానికి చెందిన ఛట్టూ గోప్ తన కుమార్తె విని దేవి అలియాస్ వీణా దేవి హత్యకు గురైందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త సాము మహతో, అనికేత్ యాదవ్ సహా మరికొందరిపై కేసు నమోదైంది.
విని దేవికి 2010లో సాము మహతోతో వివాహమైంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పెళ్లైనప్పటి నుంచి భర్త తన కుమార్తెను కొడుతూ, వేధిస్తున్నాడని ఆమె తండ్రి ఆరోపించారు. ఈ విషయంపై ఆగస్టు 30న ఖలారీ పోలీస్ స్టేషన్‌లో సన్హా కూడా నమోదైంది. ఆగస్టు 24న సాము మహతో, అనికేత్ యాదవ్ కలిసి విని దేవిని హత్య చేసి మృతదేహాన్ని దాచిపెట్టారని తండ్రి ఆరోపించారు. దీంతో కేసు నంబర్ 46/2026 కింద భారతీయ న్యాయ సంహితలోని 85, 103, 238, 3(5) సెక్షన్లతో కేసు నమోదైంది.
దర్యాప్తులో విని దేవి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోని కొన్ని వీడియోలు పోలీసులకు లభించాయి. వాటి ఆధారంగా ఆమె సూరత్‌లో ఉన్నట్లు అనుమానం వచ్చింది. మొబైల్ ఫోన్ ఆన్ కావడంతో దాని లొకేషన్ సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 15న ఖలారీ పోలీసులు సచిన్ జీఐడీసీ పోలీసులను సంప్రదించారు. స్థానికంగా సమాచారం సేకరించిన పోలీసులు ఆమెను గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో భర్త, అత్తింటివారి వేధింపులతో విసిగిపోయిన ఆమె ఎవరికీ చెప్పకుండా సుమారు 20 రోజుల క్రితం సూరత్‌కు వచ్చినట్లు తెలిపింది. అక్కడ దినసరి కూలీగా పనిచేస్తూ జీవిస్తున్నట్లు వెల్లడించింది. ఆమెను ఝార్ఖండ్ పోలీసులకు అప్పగించగా, ఇక ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. మహిళ హత్యకు గురైందన్న ఆరోపణలు, మృతదేహాన్ని దాచారన్న అంశాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగించనున్నారు.


