శంషాబాద్(హైదరాబాద్): కంటైనర్ చేసిన బీభత్సంతో అదుపుతప్పిన బస్సు హోటల్‌ల్లో దూసుకెళ్లడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లేందుకు కొద్దిసేపట్లో విమానం ఎక్కాల్సిన అతడు పరలోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటన శంషాబాద్‌లో కిషన్‌గూడ ఆర్‌వోబీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఆర్‌జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 5.30కు వర్షం కురుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటైనర్ డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొంది. అదే సమయంలో బెంగళూరు నుంచి బాచుపల్లికి వెళుతున్న సెవెన్ హిల్స్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుపై స్తంభం విరిగి పడడంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డ్రైవర్ సాధిక్ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న వాహనాలను ఢీకొట్టి హోటల్‌లోకి తీసుకెళ్లాడు.
చాయ్ కోసం ఆగితే
కరీంనగర్ జిల్లా కేంద్రం రజ్వీచమన్ రోడ్డు సిటిజన్ కాలనీకి చెందిన మహ్మద్ మోహియుద్దీన్.. తన కుమారుడు మహ్మద్ అజీమొద్దీన్ (26)ను దుబాయ్‌కి పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. ఎయిర్‌పోర్టు బ్రిడ్జి సమీపంలోని హోటల్ వద్ద చాయ్ తాగేందుకు కారు నిలిపారు. కారులోంచి బయటికి వచ్చిన అజీమొద్దీన్‌ను బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కళ్లెదుటే అజీమొద్దీన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులను శోకసంద్రంలో ముంచింది.
బీభత్సం
బస్సు హోటల్‌లోకి దూసుకెళ్లడం అక్కడే బోండాలు వేస్తున్న గ్యాస్ స్టవ్‌కు మంటలందుకున్నాయి. పాన్‌షాప్ పూర్తిగా ధ్వంసమైంది. వాహనాలు సైతం ధ్వంసం కాగా బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై హాహాకారాలు చేయడంతో పక్కనే ఈవీ చార్జింగ్ కోసం వచ్చిన ఓ యువకుడితో పాటు హోటల్ వద్ద ఉన్న మరికొందరు యవకులు ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులను బయటికి రప్పించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కరెంటు సరఫరాను నిలిపివేయించారు. స్వల్పంగా గాయపడిన పదిమందిని, తీవ్ర గాయాలపాలైన బస్సు డ్రైవర్ సాధిక్‌ను ఆస్పత్రికి తరలించారు.


