అప్పుడప్పుడు వింత వింత తీర్పులు కోర్టుల్లో కనిపిస్తుంటాయి. టీవీ స్టార్ కేసులో ఇప్పుడు అలానే ఓ తీర్పు వెలువడింది. పదేళ్ల క్రితం భారీ చోరీ జరిగి కోట్లు విలువ చేసే నగలన్నీ దొంగలు ఎత్తుకెళ్లిపోతే.. కేవలం రూ.110 మాత్రమే పరిహారంగా కోర్టు ప్రకటించింది. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఓరి నాయనో ఇదేం 'ప్రేమ'? చైత్ర-చరణ్.. అనుకున్నట్లే ట్విస్ట్)
అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్.. 2016లో ఫ్యాషన్ వీక్ కోసం పారిస్ వెళ్లింది. ఓ హోటల్‌లో ఈమె బస చేసిన టైంలో కొందరు దుండగులు.. పోలీసుల్లా వేషం వేసుకుని వచ్చారు. ఈమెని కట్టేసి బెదిరించారు. తర్వాత 6 మిలియన్ డాలర్ల విలువైన నగలని దోచుకెళ్లారు. వీటిలో ఓ వజ్రపు ఉంగరం కూడా ఉంది. అప్పటి లెక్కల ప్రకారం వీటి విలువ భారత కరెన్సీలో రూ.50-60 కోట్ల వరకు ఉండొచ్చు. గతేడాది ఈ కేసులో ఎనిమిది మంది దోషులుగా తేలారు. నిందితుల్లో పలువురు వయసైపోయిన వాళ్లు కూడా ఉండటంతో ఫ్రాన్స్‌లో వీరికి 'గ్రాండ్‌పా రాబర్స్' అనే పేరు వచ్చింది.
తాజాగా ఈ కేసులో తీర్పు వెలువడింది. పారిస్ కోర్ట్.. కిమ్ కర్దాషియన్‌తో పాటు ఈమె స్టైలిస్ట్ సిమోన్‌కి 1 యూరో(భారత కరెన్సీలో రూ.110.80) పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మొత్తం కిమ్ స్వయంగా కోరిందే కావడం విచిత్రం. ఇంత తక్కువ మొత్తాన్ని కిమ్ పరిహారంగా కోరడం వెనక ఓ కారణం కూడా ఉంది. ఈ తీర్పు తనకొచ్చే పరిహారం గురించి కాకుండా బాధ్యతని నిర్వర్తించడం, తమకు జరిగిన నష్టాన్ని గుర్తించడం గురించి అని ఈమె పేర్కొంది.
మరోవైపు ఈ దోపీడి జరిగిన టైంలో హోటల్‌లో పనిచేసిన మాజీ రిసెప్షనిస్ట్‌కి 109,516 యూరోలు పరిహారంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దాడి జరిగిన హోటల్‌కు 50,000 యూరోలు పరిహారం ఇవ్వాలని కూడా తీర్పు చెప్పింది.
(ఇదీ చదవండి: పాప మరణం.. బాధపడుతూ నటి పూర్ణ పోస్ట్)


