సామాజిక మాధ్యమాల్లో వెపన్ డీలర్లతో సంప్రదింపులు
వాట్సాప్ చాట్ గుట్టు విప్పుతున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆర్మీ ఏరియాలో తీవ్ర కలకలం సృష్టించిన ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, కేసును మరింత వేగవంతం చేశారు. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో స్పష్టమైంది. కేసులోతుల్లోకి వెళ్లే కొద్దీ మల్లేశ్ వెనక పెద్ద అక్రమ ఆయుధాల నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులకు సంచలన ఆధారాలు లభించాయి.
నిందితుడు ఫోన్ ఆధారంగా జరిపిన ప్రాథమిక దర్యాప్తులో అంతర్జాతీయ, అంతరాష్ట్ర అక్రమ ఆయుధాల వ్యాపారులతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. మల్లేశ్ తన మొబైల్ ద్వారా సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ వేదికగా దేశీయ ఆయుధ సరఫరాదారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులకు దొరకకుండా నిందితుడు తన ఫోన్‌లోని కీలక వాట్సాప్ చాట్‌లు, ఆడియో, వీడియో కాల్స్ రికార్డ్‌లు, లాగ్‌లను డిలీట్ చేసినట్లు తేలింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ నిపుణులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) టీమ్ సహకారంతో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్‌లు, మీడియా ఫైళ్లు, కాల్ డేటా రికార్డ్‌లను వెలికితీసే పనిలో పడ్డారు.
కాగా, విశాలమైన ప్రాంగణం, కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండే ఆర్మీ ఏరియా నుంచి కేవలం ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీలోని ఇంటి దొంగల సహకారం కూడా తప్పకుండా ఉంటుందనే కోణంలో ఆరా తీస్తున్నారు. కొట్టేసిన ఆయుధాలను మల్లేశ్ ఎవరికి విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకున్నాడు? గ్యాంగ్‌స్టర్లకా లేక నేరస్తులకా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అలాగే డిజిటల్ పేమెంట్లు, హవాలా లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా ఎంత మొత్తం చేతులు మారిందనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు.


