పెసరకు పిసరంతే... | Support price for the Pesara crop is not available in the markets | Sakshi
Sakshi News home page

పెసరకు పిసరంతే...

Sep 13 2026 2:20 AM | Updated on Sep 13 2026 2:22 AM

Support price for the Pesara crop is not available in the markets

మార్కెట్‌లలో దక్కని మద్దతు ధర  

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.60 లక్షల ఎకరాల్లో పెసర సాగు  

ప్రభుత్వ కేంద్రాలు ఏర్పాటు కాక వ్యాపారుల ఇష్టారాజ్యం 

నాఫెడ్‌కు లేఖ రాసి చేతులు దులుపుకున్న మార్క్‌ఫెడ్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకున్నా, అడపాదడపా కురిసిన వర్షాలతో సాగు చేసిన పెసర పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వ పరంగా కొనుగోళ్లు లేక కేంద్ర ప్రభుత్వం క్వింటాకు నిర్ణయించిన రూ.8,780 ధర దక్కక, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌కు మార్క్‌ఫెడ్‌ లేఖ రాసి చేతులు దులుపుకుంది.  

గణనీయంగా పెరిగిన సాగు 
రాష్ట్రంలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 64,610 ఎకరాలుగా అంచనా వేశారు. గత ఏడాది 61,348 ఎకరాల్లోనే సాగైంది. కానీ ఈసారి అంచనాలకు మించి 1,60,182 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాభావంతో మెట్టతోపాటు తరి పంటలు లేని చోట రైతులు పెసర సాగు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే 98,834 ఎకరాల్లో అదనంగా పంట సాగవగా.. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పంట చేతికి వచ్చి నూర్పిడి చేస్తున్న రైతులు వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. అయితే, ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్నా రెండు క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు కూడా మద్దతు ధర లేక రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.  

మద్దతు ధర హుష్‌ 
కేంద్ర ప్రభుత్వం పెసర క్వింటాకు రూ.8,780 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర మార్కెట్లలో ఎక్కడా దక్కడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోనే పరిశీలిస్తే గత నెల 14న కొనుగోళ్లు ప్రారంభం కాగా క్వింటాకు గరిష్టంగా రూ.7,600, రూ.3,400 కనిష్ట ధరగా నమోదైంది. అంటే గరిష్ట – కనిష్ట ధరకు మధ్య వ్యత్యాసం క్వింటాకు ఏకంగా రూ.4,200 తేడా ఉంది. ఈనెల 1న గరిష్టంగా రూ.7,600 పలకగా.. కనిష్ట ధర రూ.3,400కే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ఒక్క క్వింటాకూ దక్కలేదు.  

దిగుబడి లేదు.. ధర లేదు 
ఈ ఏడాది వర్షాలు అనుకూలించక పెసర దిగుబడి తగ్గింది. ఎకరాకు ఐదు క్వింటాళ్లకు బదులు రెండు క్వింటాళ్లు మించడం లేదు. రెండున్నర ఎకరాల్లో పెసర సాగు చేస్తే ఆరు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో క్వింటాకు రూ.6,700 మాత్రమే ధర పెట్టడంతో ఇక్కడ కూడా నష్టపోయాం. – తూము వీరస్వామి, చింతకాని, ఖమ్మం జిల్లా 

ప్రభుత్వ కొనుగోలు లేక.. అంతా దగా 
ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వ్యాపారుల ఇష్టం నడుస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాకు రూ.3 వేలకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర పలికితే సాగు ఖర్చులైనా మిగిలేవి.   – మడిపల్లి రమేశ్, రేపల్లెవాడ, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement