breaking news
pesara crop
-
పెసరకు పిసరంతే...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకున్నా, అడపాదడపా కురిసిన వర్షాలతో సాగు చేసిన పెసర పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వ పరంగా కొనుగోళ్లు లేక కేంద్ర ప్రభుత్వం క్వింటాకు నిర్ణయించిన రూ.8,780 ధర దక్కక, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌కు మార్క్‌ఫెడ్ లేఖ రాసి చేతులు దులుపుకుంది. గణనీయంగా పెరిగిన సాగు రాష్ట్రంలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 64,610 ఎకరాలుగా అంచనా వేశారు. గత ఏడాది 61,348 ఎకరాల్లోనే సాగైంది. కానీ ఈసారి అంచనాలకు మించి 1,60,182 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాభావంతో మెట్టతోపాటు తరి పంటలు లేని చోట రైతులు పెసర సాగు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే 98,834 ఎకరాల్లో అదనంగా పంట సాగవగా.. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పంట చేతికి వచ్చి నూర్పిడి చేస్తున్న రైతులు వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. అయితే, ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్నా రెండు క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు కూడా మద్దతు ధర లేక రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మద్దతు ధర హుష్ కేంద్ర ప్రభుత్వం పెసర క్వింటాకు రూ.8,780 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర మార్కెట్లలో ఎక్కడా దక్కడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పరిశీలిస్తే గత నెల 14న కొనుగోళ్లు ప్రారంభం కాగా క్వింటాకు గరిష్టంగా రూ.7,600, రూ.3,400 కనిష్ట ధరగా నమోదైంది. అంటే గరిష్ట – కనిష్ట ధరకు మధ్య వ్యత్యాసం క్వింటాకు ఏకంగా రూ.4,200 తేడా ఉంది. ఈనెల 1న గరిష్టంగా రూ.7,600 పలకగా.. కనిష్ట ధర రూ.3,400కే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ఒక్క క్వింటాకూ దక్కలేదు. దిగుబడి లేదు.. ధర లేదు ఈ ఏడాది వర్షాలు అనుకూలించక పెసర దిగుబడి తగ్గింది. ఎకరాకు ఐదు క్వింటాళ్లకు బదులు రెండు క్వింటాళ్లు మించడం లేదు. రెండున్నర ఎకరాల్లో పెసర సాగు చేస్తే ఆరు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మార్కెట్లో క్వింటాకు రూ.6,700 మాత్రమే ధర పెట్టడంతో ఇక్కడ కూడా నష్టపోయాం. – తూము వీరస్వామి, చింతకాని, ఖమ్మం జిల్లా ప్రభుత్వ కొనుగోలు లేక.. అంతా దగా ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వ్యాపారుల ఇష్టం నడుస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాకు రూ.3 వేలకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర పలికితే సాగు ఖర్చులైనా మిగిలేవి. – మడిపల్లి రమేశ్, రేపల్లెవాడ, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా -
పెసరలో... ‘పల్లాకు’ నివారిస్తే లాభాలే !
అనంతపురం అగ్రికల్చర్ : పల్లాకు తెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే పెసర పంట మంచి లాభదాయకమైనదేనని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి. సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. 2015లో భారీ విస్తీర్ణంలో పంట సాగులోకి రాగా... ఊహించని రీతిలో పల్లాకు తెగులు ఆశించి పంట పసుపురంగులోకి మారడంతో రైతులకు నష్టం జరిగిందన్నారు. ఈ క్రమంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు. తెగులు యాజమాన్యం పల్లాకు తెగులు తట్టుకునే రకాలైన ఎల్జీజీ–460, ఎల్జీజీ–407, పీడీఎం–54, ఎమ్ఎల్–267, డబుల్ 42 లాంటి విత్తనాలను ఎంచుకోవాలి. 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ + 1 గ్రాము కార్బండిజమ్ లేదా 2.5 గ్రాములు మాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. దీని వల్ల తొలి దశలో పైరును ఆశించే వైరస్ తెగులు, రసంపీల్చే పురుగులు, వేరుకుళ్లు తెగులు బారి నుంచి కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీలోగా విత్తుకుంటే తెగుళ్లు, పురుగుల వ్యాప్తి బాగా తగ్గుతుంది. వేసవిలో లోతుగా దుక్కులు చేసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. పైరు చుట్టూ నాలుగు వరుసలు జొన్న లేదా మొక్కజొన్న విత్తుకుంటే వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక లాంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకేసుకోవాలి. పొలంలో అక్కడక్కడా జిగురు పూసిన పసుపు రంగు రేకులు లేదా అట్టలు లేదా పళ్లాలు ఉంచితే తెల్లదోమ ఉనికి, ఉధృతిని అంచనా వేయవచ్చు. విత్తిన 15 లేదా 20 రోజులకు 5 మి.లీ వేపనూనె ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు 1.25 మి.లీ ట్రైజోఫాస్ లేదా 1 గ్రాము అసిఫేట్ లేదా 1.5 మి.లీ ప్రొపినోఫాస్ ఇందులో ఒక మందును 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే తెగుళ్లను సమూలంగా నివారించవచ్చు. -
పెరిగిన పెసర ధర
తిరుమలగిరి (నల్లగొండ): నల్లగొండ జిల్లా తిరుమలగిరిలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పెసరకు రికార్డు ధర పలికింది. క్వింటాల్‌కు రూ.7,669 ధర వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. సాధారణంగా రూ.5,000- రూ.7,000 పలికే ధర వారం రోజుల్లోనే వెయ్యికి పెరిగింది. సోమవారం మరింత ఎగబాకి రూ.7,669 గా నమోదైంది. మార్కెట్‌కు 2,500 క్వింటాళ్ల పెసలు వచ్చాయి. అయితే, రికార్డు ధర పలకటంతో రైతులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవటంతో దిగుబడి తగ్గిందని, లేకుంటే మరింతగా దిగుబడులు మార్కెట్‌ను ముంచెత్తేవని అధికారులు అంటున్నారు.


