రూ.2 వేలపై యూపీఐ చెల్లింపులు.. కొత్త రూల్‌ ఇదే! | UPI Fee MDR Consumers Government New Rules | Sakshi
Sakshi News home page

రూ.2 వేలపై యూపీఐ చెల్లింపులు.. కొత్త రూల్‌ ఇదే!

Sep 18 2026 5:32 AM | Updated on Sep 18 2026 5:32 AM

UPI Fee MDR Consumers Government New Rules

న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులపై కొత్తగా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ రుసుమును వ్యాపారులు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయకుండా చూడటంపై పేమెంట్‌ అగ్రిగేటర్లు, ఇతర చెల్లింపు సంస్థలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అక్టోబర్‌ 15 నుంచి వ్యాపారులు కస్టమర్లపై ఈ భారం మోపుతున్నారా? లేదా? అనే విషయాన్ని రోజువారీగా పరిశీలిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.

రూ.2 వేలకుపైగా చేసే కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ రుసుమును కస్టమర్ల నుంచి నేరుగా తీసుకునేందుకు వ్యాపారులకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. రూ.2 వేల వరకు చేసే చెల్లింపులకు ఎండీఆర్‌ ఉండదు. అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులపై కూడా ఈ రుసుము వర్తించదు. చిన్న వ్యాపారులకు కొన్ని మినహాయింపులు కూడా కొనసాగనున్నాయి.

కొత్త ఎండీఆర్‌ వల్ల వ్యాపారులపై జీఎస్టీ భారం కూడా పెద్దగా ఉండదని కేంద్రం చెబుతోంది. ఎండీఆర్‌పై చెల్లించే జీఎస్టీని అర్హత ఉన్న వ్యాపారులు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ అంశంపై వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎండీఆర్‌ కారణంగా యూపీఐ లావాదేవీలు తగ్గి ప్రజలు నగదు చెల్లింపుల వైపు వెళ్లే పరిస్థితి రాదని కేంద్రం భావిస్తోంది.

యూపీఐపై ఎండీఆర్‌ విధించాలనే నిర్ణయం అమెరికా ఒత్తిడితో తీసుకున్నదన్న కాంగ్రెస్‌ ఆరోపణలను కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఖండించింది. దేశీయ చెల్లింపు సంస్థలకు మరింత అవకాశం కల్పించడంతో పాటు కొత్త సంస్థలు మార్కెట్‌లోకి రావడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రూపే డెబిట్‌ కార్డులకు ఎండీఆర్‌ నుంచి మినహాయింపు కొనసాగుతున్న విషయాన్ని వారు గుర్తుచేశారు. యూపీఐ వ్యవస్థను ఎప్పటికీ పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో నడపడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఎండీఆర్‌ ద్వారా వచ్చే మొత్తంలో 5 శాతాన్ని ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు. చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని పెంచేందుకు, వారు డిజిటల్‌ చెల్లింపులను కొనసాగించేలా ప్రోత్సహించేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నారు. మొత్తంగా కొత్త ఎండీఆర్‌ అమల్లోకి వచ్చినా.. దాని భారం నేరుగా వినియోగదారులపై పడకుండా పర్యవేక్షించడమే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఇదీ చదవండి: ట్రక్‌ డ్రైవర్‌ నుంచి యూట్యూబ్‌ స్టార్‌గా.. లక్షల్లో ఆదాయం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement