ట్రావెల్
కూర్గు
సిటీ ట్రాఫిక్, ట్రాఫిక్, కంప్యూటర్ స్క్రీన్ నుండి కొన్ని రోజులు తప్పించుకుని, పచ్చని అడవుల మధ్య కాఫీ పూల వాసనలో కరిగిపోవాలని ఉందా? అయితే మీరు కూర్గుకు వెళ్లాల్సిందే. కూర్గ్ నే కాఫీ ప్యారడైజ్ అని ఎందుకంటారు అంటారు?
కర్ణాటకలోని కొడగు జిల్లానే కూర్గ్. దీన్ని అందరూ భారతదేశపు స్కాట్లాండ్ అంటారు. కాఫీ లవర్స్ దీనిని కాఫీ కేపిటల్ అని కూడా అంటారు. భారతదేశంలో పండే మొత్తం కాఫీలో 60 శాతం ఒక్క కూర్గ్ లోనే పండుతుంది.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మామూలు తోట కాదు. ఇది అడవి తోట. వంద అడుగుల ఎత్తు పెరిగే రోజ్ వుడ్, టేకు, సిల్వర్ ఓక్ చెట్ల నీడలో కాఫీ మొక్కలు పెరుగుతాయి. ఆ చెట్లకే నల్ల మిరియాల తీగలు, వనిల్లా తీగలు అల్లుకుని ఉంటాయి.
ఈ తోటల మధ్యలోనే ఏనుగులు, చిరుతలు, హార్న్ బిల్ పక్షులు తిరుగుతాయి. ఎండలో కాకుండా నీడలో నెమ్మదిగా పెరగడం వల్ల కూర్గ్ కాఫీ గింజలో చేదు తక్కువ, పండ్ల తీపి, చాక్లెట్ సువాసన ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే బెస్ట్ షేడ్ గ్రోన్ కాఫీ అంటారు.
ఎప్పుడు వెళ్లాలి?
కూర్గ్ ను సంవత్సరం పొడవునా చూడవచ్చు, కానీ కాఫీని పూర్తిగా ఫీల్ అవ్వాలంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వెళ్లవచ్చు. ఇది హార్వెస్ట్ సీజన్‌ం ఇదే బెస్ట్ టైమ్. చలి కాలంలో, ఉదయాన్నే తోటలపై దట్టమైన మంచు, మధ్యాహ్నం వెచ్చని ఎండ. ఈ సమయంలోనే ఎర్రగా పండిన కాఫీ చెర్రీలను కోస్తారు. మీరు కూడా తోటలోకి వెళ్లి చెర్రీలు కోయవచ్చు.
తరువాత మార్చి నుండి మే వరకు ఫ్లవరింగ్ సీజన్ లో వెళ్లవచ్చు. ఈ సమయంలో కాఫీ మొక్కలకు తెల్లని పూలు పూస్తాయి. లోయ మొత్తం తెల్లగా మారి, గాలి అంతా మల్లెపూల వాసన వస్తుంది. స్థానికులు దీన్ని కూర్గ్ స్నో అని పిలుస్తారు. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు అడవి మరింత పచ్చగా ఉంటుంది, కానీ వర్షం ఎక్కువగా ఉంటుంది. కాఫీ కోసం కాకుండా నేచర్ కోసం వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్ నుండి ఎలా ప్లాన్ చేయాలి?
హైదరాబాద్ నుండి కూర్గ్ సుమారు 700 కిలోమీటర్లు. 3 రోజుల ట్రిప్ కి పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇది. ఫాస్ట్ గా వెళ్లాలంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకు ఫ్లైట్ ఎక్కండి. కేవలం గంటా 15 నిమిషాల్లో బెంగుళూరు చేరిపోతారు.
బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుండి మడికేరి వరకు క్యాబ్ లేదా కేఎస్‌ఆర్టీసి ఐరావత్ బస్సులో ఆరు గంటల్లో కూర్గ్ చేరుకోవచ్చు.
బడ్జెట్ లో వెళ్లాలంటే..
హైదరాబాద్ ఎంజిబిఎస్ బస్ స్టాండ్ నుండి మడికేరికి డైరెక్ట్ కేఎస్‌ఆర్టీసి, వీఆర్‌ఎల్, ఎస్సారెస్ బస్సులు ఉన్నాయి. రాత్రి 8 గంటలకు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కూర్గ్ లో ఉంటారు.
రోడ్ ట్రిప్..
సొంత కారులో అయితే హైదరాబాద్ – బెంగళూరు – మైసూర్ – కుశాల్ నగర్ – మడికేరి రూట్ చాలా బాగుంటుంది.
ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి?
హోటల్ లో కాకుండా కాఫీ ఎస్టేట్ హోమ్ స్టేలో ఉండండి. అప్పుడే అసలైన కూర్గ్ ఫీలింగ్‌ను సొంతం చేసుకోవచ్చు. టాటా కాఫీ ప్లాంటేషన్ ట్రైల్స్, మెర్కారా గోల్డ్ ఎస్టేట్, ది తమరా కూర్గ్ బెస్ట్ ఆప్షన్స్.
ఉదయాన్నే ఎస్టేట్ ఓనర్ తో కలిసి ప్లాంటేషన్ వాక్ చేయండి. కాఫీ రోస్టింగ్, క్యూరింగ్ ఎలా చేస్తారో చూడండి. కొడవ స్పెషల్ కర్రీ, అక్కి రోటీ తినండి. అబ్బే ఫాల్స్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, నాగరహోళె టైగర్ రిజర్వ్ కూడా చూడండి.
తిరిగి వచ్చేటప్పుడు ఎస్టేట్ నుండి ఫ్రెష్ గా రోస్ట్ చేసిన అరబికా గింజలు తీసుకురావడం మర్చిపోకండి. ఒక్కసారి కూర్గ్ అడవి కాఫీ తాగితే, మళ్ళీ సిటీ కాఫీ మీకు రుచించదు.
ఇదీ చదవండి: బీచ్ ప్యారడైజ్.. 115 దీవుల సీషెల్స్ అసలు అందం ఇదే!


