గురితప్పని బంగారు బాణం | Chikitha Taniparthi Wins Gold Medal In Archery, Asia Games 2026 | Sakshi
Sakshi News home page

గురితప్పని బంగారు బాణం

Oct 1 2026 4:06 AM | Updated on Oct 1 2026 4:06 AM

Chikitha Taniparthi Wins Gold Medal In Archery, Asia Games 2026

→ గడ్డి వాము నుంచి ఆసియా క్రీడల పోడియం వరకు..

→ తండ్రి కలకు బంగారు బాణంగా మారిన చికిత

→ ఆసియా క్రీడల అరంగేట్రంలో ఒకే రోజు రెండు బంగారు పతకాలు..

గ్రామీణ  ప్రాంతాల్లో మెరికల్లాంటి క్రీడాకారులు ఉంటారన్న మాటలను నిజం చేస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ బంగారు పతకాల చికితగా దూసుకుపోతోంది. భారతీయ కాంపౌడ్‌ ఆర్చరీ క్రీడాకారిణి చికిత ఒకప్పుడు ఇంటి వెనుక,  పొలాల్లోని గడ్డివామిని లక్ష్యంగా చేసుకుని బాణాలు సంధించిన చిన్నారి. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత జెండాను ఎగరేస్తోంది. కనీస సౌకర్యాలు లేవు. ప్రత్యేక శిక్షణా కేంద్రం లేదు.

 ఖరీదైన పరికరాలు కొనుగోలు చేసే స్థోమత లేదు. అయినా ఆ కుటుంబం వెనక్కి తగ్గలేదు. కూతురి కలను నెరవేర్చేందుకు తండ్రి తన శక్తిమేరకు అండగా నిలిచాడు. ఆ నమ్మకానికి చికిత తన బాణాలతో బలాన్ని చేకూరుస్తూ వచ్చింది. సుల్తాన్ పూర్‌  పొలాల్లో సంధించిన చికిత బాణం.. కెనడాలో ప్రపంచ ఛాంపియన్ షిప్‌ స్వర్ణాన్ని దాటి ఇప్పుడు ఏకంగా ఆసియా క్రీడల స్వర్ణ శిఖరాన్ని చేరింది. ఒకేరోజు రెండు బంగారు పతకాలు సాధించి దేశం దృష్టిని ఆకర్షించిన చికిత ప్రయాణం.. 

ఇతిహాసాలను చూసి... ఇష్టం
చికితకు విల్లంబులపై మక్కువ చిన్నప్పుడే మొదలైంది. టీవీలో వచ్చే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల కథల్లో విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధించే వీరులను చూసి ఆమె ఆకర్షితురాలైంది. తెరపై చూసిన ఆ విల్లు ఒకరోజు ఆమె చేతిలోకి వచ్చింది. ఆటగా మొదలైన ఆసక్తి.. క్రమంగా జీవిత లక్ష్యంగా మారింది. 

కరీంనగర్‌లోని ఎస్పీఆర్‌ స్కూల్‌లో పది, ఇంటర్‌ గర్రెపల్లి మోడల్‌ స్కూల్‌లో ప్రస్తుతం డిగ్రీ పంజాబ్‌లో చదువుతున్నా చికిత ఆర్చరీకి ముందు రన్నింగ్, కరాటే, వాలీబాల్, బ్యాడ్మింటన్  వంటి పలు క్రీడల్లోనూ పాల్గొంది. కూతురిలోని క్రీడా ప్రతిభను గమనించిన తండ్రి శ్రీనివాసరావు.. ఆమెకు సరైన దారి చూపించాలని నిర్ణయించుకున్నారు. ఆయనకూ క్రీడలంటే ఆసక్తి. తాను సాకారం చేయలేక పోయిన క్రీడాస్వప్నాన్ని తన పిల్లలైనా సాధించాలని కోరుకున్నారు. అండగా నిలిచి  పొలంలో పంటను పండించే తండ్రి.. అదే  పొలంలో కూతురి భవిష్యత్తును కూడా పండించాడు.

తండ్రే తొలి కోచ్‌
సుల్తాన్ పూర్‌లో ఆర్చరీకి అవసరమైన శిక్షణ  వసతులు లేవు. ప్రత్యేక మైదానం లేదు. అందుబాటులో ఉన్న వనరులతోనే సాధన చేయాల్సిన పరిస్థితి. అక్కడే తండ్రి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. విల్లు పట్టడం.. బాణం ఎక్కుపెట్టడం.. లక్ష్యాన్ని గురి పెట్టడం.. ఇలా తొలి అడుగుల్లో కుమార్తెకు తోడుగా నిలిచారు.  పొలంలోని గడ్డివామును లక్ష్యంగా చేసుకుని సాధన చేయించారు. చికితకు క్రమశిక్షణ, ఏకాగ్రత పెంచేందుకు యోగా, కరాటే వంటి శిక్షణలూ అందించారు. దీంతో ఆమె కరాటేలో ఏకంగా బ్లాక్‌బెల్ట్‌ సాధించింది.

కలకోసం 23 కిలోమీటర్ల ప్రయాణం.. 
చికిత ప్రతిభ పెరుగుతున్నకొద్దీ మెరుగైన శిక్షణ అవసరం పెరిగింది. గ్రామంలో ఉన్న అవకాశాలు సరిపోకపోవడంతో తండ్రి ఆమెను కరీంనగర్‌కు తీసుకెళ్లడం  ప్రారంభించారు. సుల్తాన్ పూర్‌ నుంచి శిక్షణ కేంద్రం వరకు రోజూ సుమారు 23 కిలోమీటర్ల ప్రయాణించేది. అవసరమైన ఆర్చరీ పరికరాల కోసం అప్పు చేసి శిక్షణ ఇప్పించారు. ఆలా సాగిన ప్రయాణం 2021లో రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం సాధించి జాతీయ స్థాయి పోటీల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రతి మెట్టు ఆమెను మరింత పెద్ద వేదిక వైపు తీసుకెళ్లింది.

కరోనా వచ్చినా.. బాణం ఆగలేదు
చికిత ఆర్చరీలో ఎదుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చింది. శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆన్ లైన్  శిక్షణను ఉపయోగించుకుంది. కోచ్‌ అభిషేక్‌ వర్మ నుంచి కొత్త మెలకువలనుు నేర్చుకుంది. ఇంటి వద్దే కిట్‌ ఏర్పాటు చేసుకుని తండ్రి సహాయంతో సాధన కొనసాగించింది. 2022లో సాయ్‌ సోనిపట్‌ కేంద్రంలో చేరడం చికిత కెరీర్‌లో కీలక మలుపుగా మారింది. ఇzప్పటివరకు పరిమిత వసతుల్లో సాధన చేసిన ఆమెకు.. దేశంలోని అత్యుత్తమ ఆర్చర్లతో కలిసి శిక్షణ  పొందే అవకాశం లభించింది. పోటీ స్థాయి పెరిగింది. సాంకేతికంగా ఆమె ఆట మరింత పదునెక్కింది. కోచ్‌లు, మెంటార్స్‌ సూచనలు ఆమె ఆటకు మరింత మెరుగుదల తీసుకొచ్చాయి.
– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement