రెజ్లింగ్‌లో పురుషుల గ్రీకో రోమన్ 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ కాంస్య పతకం గెలుపొందాడు. కాంస్య పతక బౌట్‌లో సునీల్ 9–0తో రాబర్ట్స్ కాలమ్ జాన్‌స్టన్ (ఫిలిప్పీన్స్)పై గెలుపొందాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సునీల్ క్వార్టర్ ఫైనల్లో 4–0తో సుల్తాన్‌జోదా (తజికిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో సునీల్ 0–4తో తైజో యోషిదా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ సునీల్‌కు కాంస్యం దక్కింది. తద్వారా ఆసియా క్రీడల్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ గ్రీకో రోమన్ రెజ్లర్‌గా సునీల్ ఘనత వహించాడు. అంతకుముందు 2010 ఆసియా క్రీడల్లో రవీందర్ సింగ్, సునీల్ కుమార్ రాణా కాంస్య పతకాలు నెగ్గారు. మరోవైపు మహిళల 68 కేజీల విభాగంలో నిషా దహియా రిక్తహస్తాలతో వెనుదిరిగింది.


