'బంగారు' బాణాలు | India wins three gold medals in archery in Asian Games 2026 | Sakshi
Sakshi News home page

'బంగారు' బాణాలు

Oct 1 2026 4:04 AM | Updated on Oct 1 2026 4:04 AM

India wins three gold medals in archery in Asian Games 2026

ఆర్చరీలో భారత్‌కు మూడు పసిడి పతకాలు

తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికితకు రెండు స్వర్ణాలు

‘పసిడి’ గెలిచిన జట్లలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్లు జ్యోతి సురేఖ, గణేశ్‌ 

షూటింగ్‌ ట్రాప్‌లో కైనన్‌–నీరూ జోడీకి బంగారు పతకం 

మన ఖాతాలో మరో 4 కాంస్యాలు 

60 పతకాలతో 8వ స్థానంలో భారత్‌  

ఆసియా క్రీడల్లో బుధవారం భారత్‌కు స్వర్ణాల పంట పండింది. ఒకేరోజు మన బృందం నాలుగు బంగారు పతకాలతో మెరిసింది. వీటిలో మూడు ఒక్క కాంపౌండ్‌ ఆర్చరీలోనే రావడం విశేషం కాగా, షూటింగ్‌లో మరో గోల్డ్‌ మన ఖాతాలో చేరింది. రెండు స్వర్ణ పతకాలతో తెలంగాణ ఆర్చర్‌ తానిపర్తి చికిత ప్రదర్శన హైలైట్‌గా నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ కూడా పసిడిని సొంతం చేసుకుంది. హైదరాబాదీ షూటర్‌ కైనన్‌ చెనాయ్‌తో కలిసి నీరూ ధండా మరో బంగారాన్ని భారత్‌కు అందించింది.

బాక్సింగ్‌లో మూడు కాంస్యాలు, రెజ్లింగ్‌లో ఒక కాంస్యం కూడా మన ఖాతాలో చేరాయి. బుధవారం ఆర్చరీ ప్రదర్శన మరో అరుదైన అవకాశాన్ని కల్పించింది. 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి ఆర్చర్‌ కాంపౌండ్‌ విభాగంలో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ను ప్రవేశపెట్టగా...చికిత–సాహిల్‌ స్వర్ణంతో భారత్‌కు ఆ బెర్త్‌ లభించింది.

ఒకరితో పోటీ పడుతూ మరొకరు... 
మహిళల కాంపౌండ్‌ విభాగంలో భారత బృందానికి స్వర్ణం లభించింది. తానిపర్తి చికిత, వెన్నం జ్యోతి సురేఖ, ప్రీతిక ప్రదీప్‌ (మహారాష్ట్ర) సభ్యులుగా ఉన్న టీమ్‌ ఫైనల్లో 238–234 స్కోరుతో చైనా జట్టుపై విజయం సాధించింది. భారత బృందం నాలుగు సిరీస్‌లలో కలిపి మొత్తం 240 పాయింట్లకుగాను 238 పాయింట్లు (వరుసగా 60, 59, 59, 60) స్కోరు చేసింది. 2023 ఆసియా క్రీడల్లో కూడా ఈ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టు ఈసారి దానిని నిలబెట్టుకుంది. గత క్రీడల్లో కూడా జ్యోతి సురేఖ జట్టులో భాగంగా ఉండగా, తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న చికిత అద్భుత ప్రదర్శనతో చెలరేగింది.  

కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో చికిత, సాహిల్‌ జాధవ్‌ (మహారాష్ట్ర) కలిసి పసిడి పతకాన్ని గెలుచుకున్నారు. ఫైనల్లో భారత ద్వయం ‘షూటాఫ్‌’లో కొరియాను ఓడించింది. నాలుగు సిరీస్‌ల తర్వాత ఇరు జోడీలు 157–157తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూటాఫ్‌’ అవసరమైంది. ఇందులో భారత్‌ 20 పాయింట్లు స్కోర్‌ చేయగా, కొరియా 19 పాయింట్లే సాధించగలిగింది. దాంతో 1–0తో భారత్‌ పైచేయి సాధించి స్వర్ణాన్ని అందుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన 21 ఏళ్ల చికిత 2025లో ప్రపంచ యూత్‌ చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లలో టీమ్‌ విభాగంలో రెండు రజతాలు సాధించింది.  

కాంపౌండ్‌ పురుషుల విభాగంలో కూడా భారత్‌ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. భారత్‌ 238–237 పాయింట్ల తేడాతో చైనాపై గెలుపొందింది. ఈ టీమ్‌లో సాహిల్‌ జాధవ్, కుశాల్‌ దలాల్‌ (హరియాణా)లతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుమూరు గణేశ్‌ మణిరత్నం కూడా ఉన్నాడు. నాలుగు సిరీస్‌లలో వరుసగా 58, 60, 60, 60 స్కోరు చేసిన భారత బృందం పాయింట్‌ తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది.  

సీనియర్‌ ‘స్టార్‌‘ జ్యోతిసురేఖ 
విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖ దశాబ్దన్నర కాలంగా భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీకి పర్యాయపదంగా నిలిచింది. 2011లో తొలిసారి భారత సీనియర్‌ జట్టు తరఫున సురేఖ బరిలోకి దిగింది. ఇతర ఆర్చర్లు ఎవరికీ సాధ్యం కాని రికార్డులు, ఘనతలెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014 నుంచి వరుసగా నాలుగు ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆమె మొత్తంగా 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గింది. 

ప్రతిష్టాత్మక వరల్డ్‌ చాంపియన్‌ప్‌లో మూడేళ్ల క్రితం స్వర్ణం నెగ్గిన సురేఖ మరో 5 రజతాలు, 3 కాంస్యాలు కూడా సాధించింది. షూటింగ్‌ ప్రపంచకప్‌లలోనైతే ఏకంగా 11 స్వర్ణాలు గెలిచిన అద్భుత ప్రదర్శన సురేఖ సొంతం. ఆమె కెరీర్‌లో మిగిలిపోయిన ఏకైక లక్ష్యం ఒలింపిక్‌ పతకమే. 2028 క్రీడల్లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ను తొలిసారి చేర్చడంతో ఆమె ఒలింపిక్‌ పతకంపై గురి పెట్టింది.  

యూత్‌ ఆర్చరీతో మొదలు... 
తిరుపతి జిల్లా నాయుడుపేట గణేశ్‌ స్వస్థలం. పదేళ్ల వయసులో తండ్రి హరిప్రసాద్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో అతను ఆర్చరీలో ఓనమాలు నేర్చుకున్నాడు. మూడేళ్ల క్రితం వరల్డ్‌ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో అతనికి గుర్తింపు లభించింది. 2026లో ఇదే ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన టీమ్‌లోనూ గణేశ్‌ ఉన్నాడు. ఆసియా గ్రాండ్‌ప్రి సర్క్యూట్‌లో అతను ఒక్కో స్వర్ణం, రజతం, కాంస్యం నెగ్గాడు. 2025లో భారత్‌ స్వర్ణం సాధించడంలో గణేశ్‌ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం హరియాణా రాష్ట్రం సోనిపట్‌లోని స్పారో ఆర్చరీ అకాడమీలో గణేశ్‌ శిక్షణ పొందుతున్నాడు.  

సత్తా చాటిన కైనన్‌–నీరూ  
షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కైనన్‌ చెనాయ్‌–నీరూ ధండా జోడీ అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని అందుకుంది. నాలుగు సిరీస్‌లలో (6, 10, 10, 8) కలిపి వీరిద్దరు 34 పాయింట్లు సాధించారు. ఖతర్‌ (32) జంటకు రజత పతకం దక్కగా, చైనా జోడీకి (23) కాంస్యం సాధించింది. నీరూ ధండాకు ఈ ఆసియా క్రీడల్లోనే ఇది మూడో పతకం కావడం విశేషం. ట్రాప్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ ఈవెంట్లలో స్వర్ణం గెలిచిన ఆమె...టీమ్‌ ఈవెంట్‌లో రజతాన్ని గెలుచుకుంది. 2023 ఆసియా క్రీడల్లో కైనన్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో ఒక కాంస్యం నెగ్గాడు.

నాన్న గన్‌తో కైనన్‌ గోల్డ్‌...
నాన్న రెండుసార్లు జాతీయ చాంపియన్‌... చాలా మంది తండ్రుల్లాగే ఆయన కూడా తన కొడుకు తనకంటే రెండు మెట్లు పైన ఉండాలని కోరుకున్నాడు. తండ్రిగా ఆరంభంలో ఆటలో దారి చూపించి ఆపై మరింత ఎత్తుకు ఎదిగేందుకు సరైన రీతిలో సహకారం అందిస్తూ అండగా నిలిచాడు. కొడుకు కూడా ఆయన ఆశలను సరిగ్గా నెరవేరుస్తూ తాను ఎంచుకున్న ఆటలో పెద్ద స్థాయికి చేరుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. ఆ తండ్రి డేరియస్‌ చెనాయ్‌ అయితే కొడుకు కైనన్‌ చెనాయ్‌. 2023 ఆసియా క్రీడల ట్రాప్‌లో రెండు పతకాలు గెలుచుకున్న కైనన్‌... ఇప్పుడు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణంతో సత్తా చాటాడు.  

హైదరాబాద్‌లో పుట్టిన కైనన్‌ దేశంలోని అత్యుత్తమ పాఠశాల్లో ఒకటైన ఊటీలోనే హెబ్రాన్‌ స్కూల్‌లో చదువుకున్నాడు. అక్కడే స్విమ్మింగ్, ఫుట్‌బాల్, హాకీవంటి ఆటలు ఆడినా... సహజంగానే ఇంట్లో వాతావరణంతో షూటింగ్‌పై కొత్తగా ఆసక్తి కలిగింది. 12 ఏళ్ల వయసు ఉన్న తన కుమారుడి ఇష్టాన్ని కాదనలేని డేరియస్‌ తానే స్వయంగా షూటింగ్‌లో ప్రాథమికాంశాలతో శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ షూటర్‌ మన్షేర్‌ సింగ్‌ వద్ద కోచింగ్‌తో పూర్తి స్థాయిలో కైనన్‌ ట్రాప్‌ ఈవెంట్‌పై దృష్టి పెట్టాడు. 2008 కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌లో స్వర్ణంతో తొలిసారి అతను అందరి దృష్టిలో పడ్డాడు. 

ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో సీనియర్‌ స్థాయిలోనూ తన స్థానాన్ని పటిష్టం చేసుకున్న కైనన్‌ 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా బరిలోకి దిగాడు. గత ఏడాది ప్రపంచకప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన కైనన్‌ ఖాతాలో ఇంతకుముందే రెండు ఆసియా క్రీడల పతకాలు ఉన్నాయి. తాజాగా సాధించిన ఏషియాడ్‌ స్వర్ణంలో వాడిన గన్‌ వెనక ఆసక్తికర కథనం ఉంది. అతని తండ్రి డేరియస్‌ 30 ఏళ్ల క్రితం వాడిన గన్‌ బ్యారెల్‌నే కైనన్‌ ఇప్పుడు ఉపయోగించాడు. ఈ గన్‌తో డేరియస్‌ రెండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలవగా, ఇప్పుడు కొడుకు తండ్రి గన్‌లో స్వల్ప మార్పుతో బరిలోకి దిగాడు.  

నా తొలి ఆసియా క్రీడల్లోనే రెండు స్వర్ణాలు లభించాయి. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. మహిళల టీమ్‌ ఈవెంట్‌ ముగియగానే మిక్స్‌డ్‌లో పాల్గొనాల్సి వచ్చిం ది. సన్నద్ధతకు తగినంత సమయం లేకపోయినా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. షూటౌట్‌లో నేను ‘10’ స్కోర్‌ చేసినా లక్ష్యానికి ఆశించినంత దగ్గరగా రాకపోవడంతో కొంత ఉత్కంఠకు లోనైనా చివరకు పసిడి పతకం దక్కింది. –చికిత, భారత ఆర్చర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement