555 టీఎంసీలు సాధించాలి | CM Revanth Reddy meeting with Senior SC Advocate CS Vaidyanathan over Krishna waters | Sakshi
Sakshi News home page

555 టీఎంసీలు సాధించాలి

Aug 29 2026 3:49 AM | Updated on Aug 29 2026 3:49 AM

CM Revanth Reddy meeting with Senior SC Advocate CS Vaidyanathan over Krishna waters

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా అందేలా ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించాలి 

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌తో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి 

కోర్టు కేసులు, ట్రిబ్యునల్‌లో వినిపించాల్సిన వాదనలపై మంత్రి ఉత్తమ్‌తో కలిసి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ (కృష్ణా ట్రిబ్యునల్‌ –1) 
గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పొందేలా జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఎదుట వాదనలు వినిపించాలని సూచించారు. జల వివాదాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసులతోపాటు జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఎదుట రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలపై శుక్రవారం ఆయన నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌తో సమీక్ష నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే అందుకు బదులుగా  నాగార్జున సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది. ఇందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలతో పాటు ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు కలిపి మొత్తం 600 టీఎంసీలను 75 శాతం లభ్యత (నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లపాటు ఉండే వరద లభ్యత) ఆధారంగా తెలంగాణకు కేటాయించాలని 2023లో బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో స్టేట్మెంట్‌ ఆఫ్‌ కేస్‌ దాఖలు చేశామని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. ఈ కేసులో ఏపీ కౌంటర్‌ వాదనలు ముగిశాయని.. తెలంగాణ తరఫున రిజాయిండర్‌ వాదనలు ప్రారంభించినట్లు చెప్పారు. 

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో 555 టీఎంసీలకు 45 టీఎంసీల పోలవరం మళ్లింపు నీళ్లు కలిపి మొత్తం 600 టీఎంసీలు దక్కేలా వాదనలు ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.   రాష్ట్రంలో ఆ మేరకు నీటి వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని గుర్తుచేశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలను పూర్తిగా ఏపీలో వాడుకుంటారని.. గోదావరి జలాల మళ్లింపునకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలపై పూర్తి అధికారం తెలంగాణదేనని సీఎం స్పష్టం చేశారు. సాగర్‌ ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక 80 టీఎంసీల్లో ఇప్పటికే 35 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాయని.. మిగిలిన 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సిందేనని తెలిపారు. 

తీర్పు అన్యాయంగా ఉంటే అంగీకరించొద్దు.. 
జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 2011లో ఇచ్చిన అవార్డుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై వచ్చే నెలలో వాదనలు వినిపించాల్సి ఉందని న్యాయవాదులు తెలియజేయగా... కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు అమల్లోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున సరైన గ్యారంటీలు లభించకుండా ఈ తీర్పునకు అంగీకరించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరో కేసు అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై ఉందని.. తెలంగాణలో జలవిద్యుత్‌ ఉత్పాదన కోసం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో కేసు ఉందని అధికారులు నివేదించారు.

ఇక పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన కేసులో సమన్ల జారీ ప్రక్రియ జరుగుతోందని న్యాయవాదులు సీఎంకు నివేదించారు. సుప్రీంకోర్టుతోపాటు కృష్ణాలో తెలంగాణ వాదనలు బలంగా ఉండాలని.. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన నీటి వాటాను సాధించేలా పోరాటం చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ అడ్వకేట్‌ జనరల్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ కుషి్వందర్‌ వోహ్రా, ప్రముఖ న్యాయవాది సాత్విక్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ కె. ప్రసాద్, ఎస్‌ఈ ఎస్‌. విజయకుమార్, ఈఈ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement