ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక ఇస్తే.. ఇక అక్షరాలు ఎన్ని మెదళ్లను కదిలించాలి. ఈ ఒక్క వాక్యం తెలుగు భాషను అమితంగా ప్రేమించేలా చేసింది అంటాడు నవకాంత్. చిన్ననాటి నుంచి తెలుగు అక్షరాలతో దోస్తీ చేసి, అందమైన కూర్పుగా తీర్చిదిద్దుతూనే ఉన్నాడు. ‘ఎంత చిన్న ప్రయత్నమైనా సరే ఎప్పటికీ వృధా కాదు అనే పెద్దల మాట ఈ రోజు వస్తున్న గుర్తింపును బట్టి తెలుస్తోంది’ అంటూ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒంటబట్టిన ఈ కళ గురించి ఆనందంగా తెలిపాడు.
స్కూల్ రోజుల్లో నోటుపుస్తకాల్లో రాసిన అక్షరాలను చూసి టీచర్లు మెచ్చుకోవడంతో మరింత శ్రద్ధ చూపేవాడు. దీనికితోడు తోటి విద్యార్థులు తమ నోటుపుస్తకాలపైన తమ పేర్లు రాయమంటూ నవకాంత్‌తోనే రాయించు కునేవారు. చిత్రాలను వేసినా అందులో అక్షరాల కూర్పు ఉండాల్సిందే. ఇంకుపెన్నుతో అక్షరాల చిత్రాలను తీర్చిదిద్దాల్సిందే.
‘మాది తెలంగాణలోని వనపర్తి జిల్లా. పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ సెలవు రోజు పాత పుస్తకాలు అమ్ముతున్న చోటుకు వెళ్లాను. అక్కడ నా చేతి రాత లాగే ఉండే ఓ పుస్తకం కంటపడింది. దాని గురించి అడిగితే, అది ముంబయ్‌కి చెందిన ప్రముఖ కాలీగ్రాఫర్‌ది అని తెలిసింది. అంటే, చేతి రాతకు కూడా ఓ గుర్తింపు ఉంటుదనే విషయం అప్పుడర్ధమైంది. ఆరోజే ఆ పుస్తకం కొన్నాను. ఆ పుస్తకం రాసిన ఆయన్ని కలుసుకొని, ఆ కళలో మరిన్ని మెరుగులు దిద్దుకున్నాను.
తెలుగు భాష ఇచ్చిన బహుమతి...
మన మాతృభాష పలుకులోనే కాదు అక్షరాల మాలా ఎంతో అందమైనది. తెలగుభాషలోని 56 అక్షరాలతోనే పురాణ ఇతిహాసాలలోని ముఖ్యమైన పాత్రలను రూపొందించింది. తెలుగు సినిమాలకు టైటిల్స్ చేతితోనే డిజైన్ చేశాను. స్ఫూర్తిని నింపే ఉత్తేజకరమైన మంచి వాక్యాలు అక్షరాలలో పొందుపరిచి, వాటిని గిఫ్ట్స్‌గా రూపొందించాను. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే పేరుతో చేతితో రాసిన పాకెట్ నోట్ బుక్స్, బ్యాడ్జీలు, కీ చెయిన్లు, కాఫీ కప్పులు, సాసర్లు, వాల్ హ్యాంగింగ్స్, పెళ్లి పత్రికలు, రామ పట్టాభిషేకం, ఆంజనేయ చిత్రాలు డిజైన్ చేశాను. దేశంలోనూ, విదేశాల్లోనూ తెలుగు అక్షరమాలకు సంబంధించిన వర్క్‌షాప్‌లు నిర్వహించాను.
అందమైన అక్షరాలు..
దేశ నాయకులు, పద్యాలు, శ్లోకాలు .. దేని గురించి చె΄్పాలన్నా అది అక్షరాలలోనే చిత్రిస్తున్నాను. అక్షరాల మీద ఇష్టం ఉంటే తీరిక సమయాల్లో చూసుకో. కానీ, ప్రస్తుతానికైతే ఉద్యోగం చూసుకో అని కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు చెప్పినవారున్నారు. కానీ, నా అభిరుచి తెలుగుభాష, అక్షర మాలపైనే ఉంది. ఇంగ్లిçషుపైన మక్కువ పెరుగుతున్న ఈ రోజుల్లో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన సమయం ఇదే అనిపిస్తుంది. అలాగని, ఎవరైనా కోరితే మిగతా భాషల్లోనూ అక్షరాలను అందంగా రాసి, ఇస్తాను. ఇదే ఉపాధిగా కూడా ఎంచుకున్నాను. ఎవరైనా అప్పటికప్పుడు నా చేత అక్షరాలను పేపర్‌పైన రాయించుకుంటారు. ప్రశంసిస్తుంటారు. ఈ పనిలో నాకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. తెలుగు భాషను బతికించుకుంటున్నందుకు ఆనందంగానూ ఉంది. ఎవరైనా ఈ వర్క్ నేర్పించమని ఆసక్తిగా అడిగితే, వారికి శిక్షణ కూడా ఇస్తుంటాను. ఏ ప్రాంతంలో ఉన్నా నా అక్షరాల ద్వారా మాతృభాషకు గుర్తింపు తీసుకురావాలి, ఇదే నాప్రస్తుత, భవిష్యత్తు ఆలోచన కూడా’ అంటాడు ఈ అక్షరశిల్పి.
– నిర్మలారెడ్డి


