సందర్భం
ఒక జవాబు ఏం చేస్తుందో తెలియదుకానీ...ఒక ప్రశ్న మాత్రం చాలా చేస్తుంది! ఆ ప్రశ్న ఆమెను కొత్తగా ఆలోచించేలా, కొత్త ఆవిష్కరణకు స్ఫూర్తినిచ్చేలా చేసింది. ఆ ఆవిష్కరణే అనీమా ఆనంద్‌కుమార్‌ను టైమ్స్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ పీపుల్ ఇన్ ఏఐ’ జాబితాలో చోటు సాధించేలా చేసింది...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యాసాలు రాయగలదు. ప్రశ్నలకు జవాబులు చెప్పగలదు. ఇన్ని చేసే కృత్రిమ మేధస్సు... భౌతిక ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోగలదా? సెమీకండక్టర్ తయారీని మెరుగుపరచగలదా? ఇప్పుడున్న సాంకేతిక పద్ధతుల కంటే అసాధారణ వాతావరణాన్ని మెరుపు వేగంతో పసిగట్టగలదా?... ఈ ప్రశ్నలు అనీమా ఆనంద్ కుమార్‌ను లోతుగా ఆలోచించేలా చేశాయి. ప్రమాద నష్టాలను తగ్గించే సాంకేతికతపై కాకుండా ప్రమాదాలను ముందుగా పసిగట్టే సాంకేతికతపై దృష్టి పెట్టారు అనీమ. దాని ఫలితమే... యాక్సిలరేటెడ్ అండర్‌స్టాండింగ్ అనే సంస్థ.
మరో ముందడుగు
ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్ అయిన అనిమా ఆనంద్ కుమార్, బెనెడిక్ట్ జెనిక్‌తో కలిసి ‘యాక్సిలరేటెడ్ అండర్‌స్టాండింగ్ ఇంక్’ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి ఏఐ దిగ్గజాలను ఎదుర్కోవడానికి, వాటికి దీటుగా ఏఐ చాట్‌బాట్‌లు, మోడల్స్‌ని నిర్మించడానికి ఎన్నో టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ టెక్ కంపెనీల జాబితాలో తాజాగా ‘యాక్సిలరేటెడ్ అండర్‌స్టాండింగ్’ సంస్థ చేరింది.
‘ఇది ఏఐ ప్రపంచంలో మరో ముందడుగు’ అని అంటున్నారు విశ్లేషకులు. అనిమ రూ΄÷ందించిన అల్గారిథమ్, వాతావరణ సూచన, వైద్యపరికరాల డిజైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్ తయారీ, న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్‌కు ఉపయోగపడుతుంది.
పిన్న వయసులోనే ప్రొఫెసర్
కర్నాటకలోని మైసూర్‌లో జన్మించిన అనీమ ఐఐటీ, మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, కార్నెల్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎంఐటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. టెక్నాలజీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందు యూసీ ఇర్వీన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాల్టెక్ యూనివర్శిటీలో అత్యంత పిన్నవయస్కురాలైన ప్రొఫెసర్‌గా గుర్తింపు ΄÷ందారు. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా, ‘ఎన్విడియ’లో ఏఐ రిసెర్చ్‌కు సంబంధించి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ప్రత్యేకత ఇది...
‘యాక్సిలరేటెడ్ అండర్ స్టాండింగ్ ఇంక్’ అనేది న్యూరల్ ఆపరేటర్స్ అనే సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఫిజికల్ సిస్టమ్స్ నుండి నేర్చుకున్నదాన్ని వివిధ సమస్యల పరిష్కారానికి ఏఐ సిస్టమ్స్‌ను ఉపయోగించుకుంటుంది. తమ సిస్టమ్ సింగిల్ ప్రాంప్ట్‌లో 5 ట్రిలియన్‌ల డేటా పాయింట్స్‌ను ప్రాసెస్ చేయగలదని కంపెనీ తెలియజేసింది.
టైమ్ ప్రశంస
‘వాతావరణాన్ని ఏఐ నియంత్రించలేకపోవచ్చు. కానీ దానిని అంచనా వేయగలదు. ఈ కాలెక్ట్ ప్రొఫెసర్ (అనీమ) అత్యంత వేగంగా వాతావరణాన్ని అంచనా వేసే పద్ధతులకు మార్గదర్శకత్వం వహించారు. సంప్రదాయ విధానాల కంటే వేల రేట్లు వేగంగా వాతావరణాన్ని అంచనా వేయడానికి అల్గారిథమ్‌లను రూ΄÷ందించారు. క్వాంటం కంప్యూటర్‌లు, నూతన వైద్యపరికరాలు రూ΄÷ందించడానికి, కంప్యూటర్ చిప్ తయారీలో కీలక దశను ఆప్టిమైజ్ చేయడానికి...ఇంకా మరెన్నో పనులకు అల్గారిథమ్‌లను ఉపయోగించారు’ అని అనీమా ఆనంద్‌కుమార్‌ను పరిచయం చేసి, ప్రశంసించింది టైమ్ మ్యాగజైన్.
ఐక్యరాజ్య సమితిలో అనీమ
ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి శాస్త్రీయ సలహా మండలిలో సభ్యురాలిగా అనీమా ఆనంద్ కుమార్ నియామకం అయ్యారు. తద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి శాస్త్రీయ ఎజెండాను రూ΄÷ందించడంలో సహాయం అందించారు అనీమ. ఏఐ సాంకేతికత గురించి తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏఐ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంపై ప్రచారం చేశారు.


