నెల రోజుల్లో 30% పెరిగిన ధర... రిటైల్ మార్కెట్లో సగటున కేజీ రూ. 63
తగ్గిన ఉత్పత్తి.. పండుగల సీజన్ డిమాండ్‌తో కొరత
పంట నష్టం.. అక్రమ నిల్వలతో సరఫరాపై ప్రభావం
ఇథనాల్ కోసం మళ్లింపు ప్రభావం కూడా!
దశాబ్దం తర్వాత దేశం తొలిసారి దిగుమతుల బాట
ఇప్పటికే ఎగుమతులపై నిషేధం.. బల్క్ యూజర్లకు నిల్వలపై ఆంక్షలు
ముందస్తు క్రషింగ్‌తో సరఫరా పెంచేందుకు కేంద్రం చర్యలు
దేశంలో చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చెరకు పంట నష్టం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశీయంగా ఉత్పత్తి అంచనాలు తగ్గడం, పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ భారీగా ఎగబాకడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. నెల రోజుల్లోనే 30 % ఎగసిన రిటైల్ రేటు ప్రస్తుతం సగటున కేజీ రూ. 63 స్థాయికి చేరింది. దీంతో సరఫరా పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు దశాబ్దకాలం తర్వాత కేంద్రం తొలిసారి దిగుమతులకు తలుపులు తెరిచింది. అక్రమ నిల్వలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. మరోవైపు చక్కెర కొరతకు ప్రభుత్వ ఇథనాల్ పాలసీ కూడా కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, బిజినెస్ డెస్క్: చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. దాదాపు పదేళ్ల తర్వాత దిగుమతుల బాట పట్టింది. సరఫరా తగ్గడంతోపాటు పండుగలు,వివాహాల సీజన్ దగ్గరపడుతుండటంతో చక్కెరకు డిమాండ్ జోరందుకుంది. ఇళ్లలో వినియోగంతోపాటు స్వీట్లు, బేకరీలు, పానీయాలు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ చక్కెర అవసరం పెరుగుతోంది. దీంతో రిటైల్‌గా కిలో చక్కెర ధర జూలై 20న రూ. 48 స్థాయిలో ఉండగా తాజాగా రూ. 63 (దేశవ్యాప్త సగటు)కు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు 30 శాతం పెరిగింది. ఏడాదిలో దాదాపు 35 శాతం జంప్ చేసింది. కొందరు వ్యాపారులు, ఉత్పత్తిదారులు నిల్వలు పెంచుకోవడం కూడా సరఫరాపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను అదుపులో ఉంచడంతోపాటు మార్కెట్‌లో సరఫరా కొరతకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు తెరతీసింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది.
మిగులు నుంచి కొరతలోకి...
భారత్ సాధారణంగా ఏడాదికి 3.2–3.4 కోట్ల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. దేశీయంగా వినియోగం 2.8–2.9 కోట్ల టన్నుల వరకు ఉంటుంది. అంటే పంట బాగా పండితే నికరంగా మిగులు ఉంటుంది. ఎగుమతులు, కొంత ఇథనాల్‌కు మళ్లింపు ద్వారా దీన్ని పరిశ్రమ మేనేజ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారింది. పంచదార ఉత్పత్తి అంచనాలు తొలుత 3.43 కోట్ల టన్నులుగా ఉండగా తాజాగా ప్రభుత్వం దాన్ని 3.06 కోట్ల టన్నులకు కుదించింది. దీంతో దేశీ వినియోగం కోసం సరిపడా సరఫరా ఉన్నప్పటికీ అదనంగా అందుబాటులో ఉండే నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. తక్కువ దేశీయ ఉత్పత్తి, పెరిగిన సీజనల్ డిమాండ్‌తోపాటు అకాల వర్షాలు, పంట తెగుళ్ల కారణంగా చెరకు పంట దెబ్బతినడం, అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
నిల్వలపై కేంద్రం నిఘా
కొందరు వ్యాపారులు, ఫ్యాక్టరీలు చక్కెరను అవసరానికి మించి నిల్వ చేస్తున్నాయన్న సమాచారం నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితి విధించింది. దీన్ని 200 టన్నులకు తగ్గించాలని కూడా ఐఎస్‌ఎంఏ డిమాండ్ చేస్తోంది. బల్క్ వినియోగదారులు (పానియాలు, చాక్లెట్లు, స్వీట్లు–బేకరీ తయారీ తదితర సంస్థలు) 15 రోజుల అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా సెప్టెంబర్ 1 నుంచి నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా నిఘా పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చక్కెర ఫాక్టరీల్లో నిల్వల తనిఖీపై దృష్టిపెట్టారు.
ముందస్తు క్రషింగ్...
చక్కెర దిగుమతులతోపాటు దేశీయ ఉత్పత్తిని త్వరగా మార్కెట్‌లోకి తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. సాధారణంగా ప్రారంభమయ్యే సమయం కంటే ముందే అక్టోబర్ 15 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలు, చక్కెర కర్మాగారాలకు సూచించింది. ముందస్తు క్రషింగ్ వల్ల అక్టోబర్‌లో చక్కెర ఉత్పత్తి సాధారణంగా ఉండే 3–4 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులకుపైగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
అంతర్జాతీయంగానూ ధరలు పైపైకి
దేశీయ ఉత్పత్తి తగ్గడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర సరఫరా తగ్గుముఖం పట్టింది. 2026–27లో ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల టన్నుల మేర చక్కెర కొరత ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కాగా, అంతర్జాతీయంగా చక్కెర ధర జూన్ 30న టన్నుకు 474 డాలర్ల నుంచి ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు పెరిగింది. అంటే రెండు నెలల్లోనే 16 శాతానికిపైగా ఎగసింది. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులకు తెరతీయడం వల్ల దేశీయంగా సరఫరా పెరిగినా.. అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడం వల్ల, రూపాయి క్షీణత కారణంగా దిగుమతులు భారంగా మారొచ్చనేది మార్కెట్ వర్గాల మాట.
ఇథనాల్‌కు మళ్లింపు ప్రభావం?
చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే ప్రస్తుత కొరత ఏర్పడిందన్న విమర్శలు జోరందుకున్నాయి. భారతీయ చక్కెర, బయో ఇందన తయారీదారుల సంఘం (ఐఎస్‌ఎంఏ) 2025–26 సీజన్ (అక్టోబర్–సెప్టెంబర్)లో నికరంగా చక్కెర ఉత్పత్తి 2.9 కోట్ల టన్నులుగా లెక్కగట్టింది. దీనికి ప్రధానంగా 31 లక్షల టన్నుల చక్కెరకు సమానమైన ఫీడ్‌స్టాక్ ఇథనాల్ కోసం మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా చెరకు పంటలో ఇది 10 శాతంగా అంచనా. అయితే దేశీయంగా చక్కెర కొరత లేదని రానున్న రోజుల్లో రిటైల్ ధరలు దిగొస్తాయని ఐఎస్‌ఎంఏ పేర్కొంది. మరోవైపు కేంద్రం ఇథనాల్‌పై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తోంది. ఇథనాల్ కోసం చక్కెర (చెరకు రసం, సిరప్, మొలాసిస్) మళ్లింపు వాటా 2022–23లో సుమారు 12 శాతం ఉండగా 2025–26లో అది 9 శాతానికి తగ్గినట్లు చెబుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్‌లో దాదాపు మూడొంతుల ఫీడ్‌స్టాక్ ధాన్యాల నుంచి ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తోందని స్పష్టం చేసింది. ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదల ఇథనాల్ తయారీ కోసం చక్కెరను మళ్లించడం వల్ల కాదనేది కేంద్రం వాదన. దేశంలో చక్కెర నిల్వలేమీ అడుగంటలేదని.. ఉత్పత్తి తగ్గడంతోపాటు పండుగల ముందు పెరిగిన డిమాండ్‌తో సాధారణంగా ఉండే అదనపు నిల్వలు తగ్గిపోవడమే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.


