కేంద్ర ప్రభుత్వంలో ఏకంగా 8 లక్షలకు పైగా జాబ్స్? | Eight Lakh Government Posts Vacant, RTI Reveals Massive Workforce Gap Across India, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వంలో ఏకంగా 8 లక్షలకు పైగా జాబ్స్?

Aug 23 2026 5:08 PM | Updated on Aug 23 2026 6:24 PM

eight lakh government posts vacant rti shows massive workforce

ఢిల్లీ: ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న సమస్యలలో నిరుద్యోగం ప్రధానమైనది. ఏళ్ల తరబడి పెద్ద పెద్ద చదువులు చదివినా దానికి సరిపడా ఉద్యోగం దొరకక యువతంతా ఉద్యోగాల కోసం తల్లడిల్లిపోతున్నారు. పెద్దచదువులు చదివినా దాని సరిపడా ఉద్యోగం దొరకక చిన్నా చితక జాబ్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక గుడ్‌ న్యూస్‌ అందింది. దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్లు కేంద్రం తెలిపింది.

నీమచ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఉద్యోగాల ఖాళీలపై ఆర్టీఐ దాఖలు చేశారు. దానికి బదులిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పే రీసెర్చ్ యూనిట్ 2024 మార్చి 1 నాటి గణాంకాలను వివరాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిలియన్‌ ఉద్యోగాల్లో ఏకంగా 8,23,656 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఈ లెక్కల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు PSUలను మినహాయించుకొని ఈ లెక్కలు ప్రకటించింది. 

ఇందులో అత్యధిక ఖాళీలు  రక్షణ మంత్రిత్వ శాఖ సివిలియన్‌ విభాగంలో ఉన్నాయి. మొత్తం 5,56,248 పోస్టులు మంజూరై ఉండగా కేవలం 3,14,005 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 2,42,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం మంజూరైన పోస్టుల్లో దాదాపు 43.5 శాతం. అయితే ఈ సంఖ్యలు సైన్యం, నేవీ, వైమానిక దళంలోని ఉద్యోగాలకు సంబంధించినవి కావని, కేవలం రక్షణ శాఖ సివిలియన్‌ ఉద్యోగాలకే సంబంధించినవని అధికారులు స్పష్టం చేశారు.

రైల్వేలో

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో ఒకటైన రైల్వేల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. రైల్వేల్లో 14,79,701 పోస్టులు మంజూరై ఉండగా 12,39,576 మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. దీంతో 2,40,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేల్లోని ఖాళీలే ఆర్టీఐ ద్వారా వెల్లడైన మొత్తం ఖాళీల్లో దాదాపు 30 శాతం కావడం గమనార్హం.

 హోం మంత్రిత్వ శాఖ

అంతర్గత భద్రత, పరిపాలనలో కీలకమైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో 1,10,885 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ శాఖలో మొత్తం 11,18,233 పోస్టులు మంజూరై ఉండగా 10,07,348 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రక్షణ శాఖ సివిలియన్‌ విభాగం, రైల్వేలు, హోం శాఖలను కలిపితే దాదాపు 5.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం ఖాళీల్లో దాదాపు మూడొంతులు ఈ మూడు ప్రధాన సంస్థల్లోనే ఉన్నాయి.

పోస్టల్‌

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌లో 2,53,124 పోస్టులకు గాను 1,91,578 మంది పనిచేస్తున్నారు. దీంతో 61,546 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూలో 1,79,374 పోస్టులు మంజూరై ఉండగా 1,09,712 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో 69,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మంజూరైన పోస్టుల్లో దాదాపు 39 శాతం కావడం విశేషం.

వ్యవసాయం

వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లోనూ సిబ్బంది కొరత కనిపిస్తోంది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో 5,420 పోస్టులకు గాను 3,565 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,855 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలో 2,393 పోస్టులకు గాను కేవలం 1,015 మంది పనిచేస్తుండగా 1,378 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ శాఖలో దాదాపు 58 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పర్యావరణ శాఖ

పర్యావరణ శాఖలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో 5,127 పోస్టులకు గాను 3,170 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,957 పోస్టులు, అంటే దాదాపు 38 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో 6,302 పోస్టులకు గాను 3,684 మంది మాత్రమే పనిచేస్తుండగా 2,618 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆరోగ్య రంగం

ఆరోగ్య రంగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 27,427 పోస్టులకు గాను 25,845 మంది పనిచేస్తున్నారు. దీంతో 1,582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య పరిశోధన శాఖలో 62 పోస్టులకు గాను కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తుండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ శాఖలో 432 పోస్టులకు గాను 199 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 233 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన కీలక శాఖల్లోనూ ఖాళీలు ఉన్నాయి. అణుశక్తి శాఖలో 37,250 పోస్టులకు గాను 27,016 మంది మాత్రమే పనిచేస్తుండగా 10,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతరిక్ష శాఖలో 19,200 పోస్టులకు గాను 15,074 మంది పనిచేస్తున్నారు. దీంతో 4,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో కూడా 1,681 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

దేశ అత్యున్నత పరిపాలనా కార్యాలయాల్లోనూ ఖాళీలు ఉండటం గమనార్హం. రాష్ట్రపతి సచివాలయంలో 803 పోస్టులు మంజూరై ఉండగా 516 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 287 పోస్టులు, అంటే 35.74 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) 441 పోస్టులకు గాను 315 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 126 పోస్టులు, అంటే 28.57 శాతం ఖాళీగా ఉన్నాయి.

ఈ భారీ ఖాళీలపై ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడేందుకు ఈ ఖాళీలను అత్యంత ప్రాధాన్యతతో, మిషన్‌ మోడ్‌లో భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement