మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజినగర్‌లోని కొండపై భర్త, కుమారుడితో కలిసి ప్రాణాలు కోల్పోవడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు.. సంగీత తన యూట్యూబ్ ఛానెల్‌లో బంధాలు-విలువలపై పోస్ట్ చేసిన వీడియో సంచలనం కలిగిస్తోంది. సంగీత... ఆమె భర్త మురళీధర్ చంద్‌గుడే, వారి 18 ఏళ్ల కుమారుడు కునాల్.. శుక్రవారం మధ్యాహ్నం కోడ్యా డోంగార్‌లోని 200 అడుగుల లోతైన లోయలో పడి మరణించారు. కుమారుడి కొత్త ఫోన్ ఈఎంఐల విషయంలో జరిగిన వివాదం కారణంగా ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
అయితే, ఘటన జరిగిన ఒకరోజు ముందే (గురువారం) సంగీత తన యూట్యూబ్ వేదికగా రికార్డ్ చేసిన ఒక సెల్ఫ్ వీడియోను షేర్ చేస్తూ, "ప్రేమకు విలువ ఇవ్వని వ్యక్తి కోసం ఏ పనీ చేయడంలో అర్థం లేదంటూ పేర్కొన్నారు. ‘‘మీరు మీ సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి.. కానీ అది మిమ్మల్ని, మీ ప్రేమను విలువైనదిగా భావించే వారికే. ఒక వ్యక్తి మిమ్మల్ని విలువైనదిగా భావించకపోతే.. మీ ప్రేమను పట్టించుకోకపోతే, మీరు అతని కోసం చేసే పనులకు విలువ లేకపోతే.. అలాంటి వ్యక్తి కోసం ఏ పనీ చేయడంలో అర్థం లేదు" అంటూ ఆమె మరాఠీ భాషలో నిమిషం పాటు సాగిన ఆ వీడియోలో చెప్పారు.
చపాతి అనేది రెండు వైపులా కాలిస్తేనే రుచిగా ఉంటుంది. సంబంధాల విషయంలోనూ అంతే. రెండు వైపుల నుంచి నడిస్తే, ఇద్దరూ దానికి విలువ ఇస్తేనే అలాంటి సంబంధంలో ఉండాలి. లేదో ఒకరు మాత్రమే విలువ ఇస్తూ మరొకరు పట్టించుకోకపోతే ఆ బంధానికి అర్థం లేదు. అలాంటి సంబంధం నుండి బయటపడటమే ఎప్పుడైనా మంచిదంటూ ఆమె తెలిపారు. యూట్యూబ్‌లో 29 వేల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న సంగీత.. తన ఛానెల్‌లో అనేక మోటివేషనల్ వీడియోలను పోస్ట్ చేశారు. అంతేకాకుండా, ఆమె తన కుమారుడితో కూడిన షార్ట్ వ్లాగ్‌లను కూడా షేర్ చేసేవారు.
ఇదీ చదవండి: ఐఫోన్ ఈఎంఐ గొడవ.. వెలుగులోకి పాత వీడియోలు
అసలేం జరిగిందంటే..
ఐ ఫోన్ విషయంలో జరిగిన గొడవ విషాదంగా మారింది. కుమారుడు కునాల్ ఐఫోన్ కొనుగోలు చేయగా.. దాని ఈఎంఐలు చెల్లించేందుకు కుటుంబ సభ్యులను డబ్బులు అడిగాడు.. ఈ క్రమంలో ఒప్పుకోని తండ్రి మురళీధర్.. కొడుకును మందలించాడు. ఇదే విషయమై ఇంట్లో గొడవ జరిగింది. కుమారుడు కునాల్ పట్టరాని కోపంతో తిస్గావ్ ప్రాంతంలోని ఓ కొండపైకి చేరుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మురళీధర్, సంగీతతో పాటు మరికొందరు స్థానికులు కొండపైకి వెళ్లి అతనితో మాట్లాడి ఇంటికి తిరిగి రావాలని ఒప్పించేందుకు ప్రయత్నించారు.
సుమారు మూడు గంటల తర్వాత.. మురళీధర్ కునాల్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అతన్ని కొండ అంచు నుంచి వెనక్కి లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ అదుపుతప్పి సుమారు 250 అడుగుల లోతైన లోయలో పడిపోయారు. తన భర్త, కుమారుడు కిందపడటాన్ని చూసిన సంగీత తట్టుకోలేక కొన్ని సెకన్ల తర్వాత తాను కూడా దూకింది. దీంతో ఈ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.


