ఛండీఘడ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం భగవంత్ మాన్ సతీమణి డాక్టర్ గుర్‌ప్రీత్‌కౌర్ ఓ అత్యాచార కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.5కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవికి భగవంత్ మాన్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్,శిరోమణి అకాళిదళ్ పార్టీలు సైతం సీఎం రాజీనామాకు పట్టుబడుతున్నాయి.
ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచార కేసును నీరుగార్చేందుకు సీఎం భగవంత్ మాన్ సతీమణి డాక్టర్ గుర్‌ప్రీత్‌కౌర్ ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం ఆమె రూ.5కోట్ల వరకు డిమాండ్ చేశారని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ కేసుపై విచారణ చేపట్టాలని జస్టిస్ రంజిత్ సింగ్ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కోరారు.
జస్టిస్ రంజిత్ ఆరోపణలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివాదం చెలరేగిన తర్వాత, గురుప్రీత్ కౌర్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్‌కు లీగల్ నోటీసు పంపారు. కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ ఖైరాకు ఈ మాజీ న్యాయమూర్తి బావమరిది అవుతారు.
పంజాబ్‌లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు తలెత్తిన ఈ భారీ వివాదం నేపథ్యంలో షిరోమణి అకాలీదళ్ కూడా ముఖ్యమంత్రి రాజీనామాను డిమాండ్ చేసింది. బీజేపీ, అకాలీదళ్ పార్టీలు రాబోయే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై దర్యాప్తు చేసి మాకు నివేదిక సమర్పించాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఆదేశించాం. అలాగే ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మహిళా భద్రతా విభాగానికి కూడా తెలియజేశాం’ అని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు వెల్లడించారు.
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మాన్ ఈ విషయంపై వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వచ్చాయి, అసలు నిజం ఏంటనేది ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టం చేయాలి అని ఆయన అన్నారు. ఆప్ మహిళా వింగ్ చీఫ్ అమన్‌దీప్ కౌర్ అరోరా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి సతీమణి తీసుకున్న చట్టపరమైన చర్యలను ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు.
అబద్ధాలు హద్దులు మీరినప్పుడు, కేవలం రాజకీయంగానే కాకుండా చట్టపరంగా కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా బావమరిది అయిన రంజిత్ సింగ్ ఇటీవలే డాక్టర్ గురుప్రీత్ కౌర్‌పై నిరాధార ఆరోపణలు చేశారు. ఆమె.. ఆయనకు లీగల్ నోటీసు పంపుతూ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కోర్టు ద్వారా న్యాయపరమైన చర్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లలో ఆప్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో ఏమి చేయలేక అకాలీదళ్, బీజేపీలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాయని, అందుకే దీని వెనుక రాజకీయ ఎజెండా ఉందని ఆమె ఆరోపించారు.
👉ఇదీ చదవండి: నా లివర్ ఏమైనా ఐరన్‌తో చేశారా?: సీఎం భగవంత్ మాన్


