నా లివర్‌ ఏమైనా ఐరన్‌తో చేశారా?: సీఎం భగవంత్‌ మాన్‌ | You Think My liver made of solid iron installed Bhagwant Mann | Sakshi
Sakshi News home page

నా లివర్‌ ఏమైనా ఐరన్‌తో చేశారా?: సీఎం భగవంత్‌ మాన్‌

May 25 2026 7:47 PM | Updated on May 25 2026 8:18 PM

You Think My liver made of solid iron installed Bhagwant Mann

చండీగఢ్‌: తాను అసెంబ్లీకి తాగి వచ్చాననే విమర్శలు,  రాత్రి-పగలు తాగుతూ ఉంటారనే ఆరోపణల్ని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సింగ్‌ స్పందించారు. తనపై విమర్శలు చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని, అంతకుమించి వారికి పనీపాటా ఏమీ లేనట్లు ఉందన్నారు భగవంత్‌ మాన్‌. ఎన్డీటీవీ నిర్వహించిన నవ పంజాబ్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..  ఇక రాష్ట్రంలో ఏ అంశం లేనట్లు తాను నిరంతరం తాగుతూ ఉంటాననే ఆరోపణలు తప్పితే ఇంకా ఏమీ ప్రతిపక్షాలకు లేవా అని ప్రశ్నించారు. 

తాను 2012లో యాక్టివ్‌ పాలిటిక్స్‌లో అడుగుపెట్టానని, ఇప్పటికి 14 ఏళ్లు అయ్యిందన్నారు భగవంత్‌ మాన్‌సింగ్‌. అప్పట్నుంచీ తాను పగలు-రాత్రి లేకుండా తాగుతూనే ఉంటానని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

నిజంగా తాను 14 ఏళ్ల నుంచి పగలు-రాత్రి తేడా లేకుండా తాగుతూనే ఉంటే బ్రతికే ఉండేవాడినా? అని ఎదురు ప్రశ్నించారు. మనకు తెలిసిన మిత్రులు కానీ, బంధువులు కానీ, వేరే ఎవరైనా కానివ్వండి.. 14 ఏళ్ల నుంచి రాత్రి-పగలు అనే తేడా లేకుండా తాగితే బ్రతుకుతారా?, అలా బ్రతికి ఉన్నవాళ్లని చూశారా? అంటూ చమత్కరించారు.  ఒకవేళ తన లివర్‌ను ఏమైనా ఐరన్‌ రాడ్‌తో చేశారని వారు అనుకుంటున్నారా? వారే చెప్పాలన్నారు. 

ఇది తనపై జరిగే వ్యక్తిత్వ హననం తప్పితే ఏమీ లేదన్నారు. తన ప్రత్యర్థులకు తనను సవాలు చేయడానికి గట్టి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.ఇతరులపై కూడా ఇలాంటి ఆరోపణలు చేసినట్లు ఆయన సూచించారు. ఉదాహరణకు, శిరోమణి అకాలి దళ్ నేత సుఖ్బీర్ బాదల్ అఫీమ్  వాడతారని, అందుకే ఆయనను "సుఖ్మాలి" అని పిలుస్తారని ఆరోపణలు ఉన్నాయి. ముందుగా ఆ ఆరోపణపై బాదల్ స్పష్టత ఇవ్వాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement