సాక్షి, హైదరాబాద్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతి ముఖీ సంపాదన మీదన తమ కుటుంబమంతా ఆధారపడి ఉందని ఆమె తల్లి ఆనందిని ముఖి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులోనే తమని వదిలి అనంతలోకాలకు వెళుతుందని తాము అనుకోలేదని బోరున విలపించారు. ఇటీవల జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు నిర్లక్షంగా కారు నడిపి భారతీ ముఖి అనే సేల్స్ గర్ల్‌ని కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆ యువతి మృతిపై ఆమె తల్లి ఆనందిని ముఖి కన్నీరు మున్నీరవుతున్నారు.
ఆనందిని ముఖి ఆవేదనతో మాట్లాడుతూ.. నా కుమార్తె భారతి ముఖిని ఎంతో కష్టపడి పెంచి చదివించాను .డిప్లొమా పూర్తి చేసిన తర్వాత బీటెక్‌లో సీటు కూడా సంపాదించింది. కానీ కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా చదువు కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఉద్యోగం నిమిత్తం నా కుమార్తె హైదరాబాద్‌కు వెళ్లింది. 4-5 ఏళ్లుగా అక్కడే ఉంటూ.. ఇంటికి వచ్చి వెళ్తూ.. డబ్బులు పంపేది మా కుటుంబం భారతి ముఖి మీదే ఆధారపడి బతుకుతున్నాం. కానీ.. ఇంతలోనే నా కుమార్తె అనంత లోకాలకు తిరిగి వెళ్లిపోయింది ఇంత చిన్న వయసులోనే నా కూతురు చనిపోతుందని అనుకోలేదు". అంటూ ఆనందిని ముఖి బోరున విలపించారు.
ఏం జరిగింది?
ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పని చేసే భారతి ముఖి తన సహోద్యోగి పూజా అశోక్ అలోన్‌తో కలిసి ఈ నెల 16న మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనం చేయడానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారిద్దరూ తిరిగి వస్తూ ఇనార్బిట్ మాల్‌లోకి వచ్చేందుకు జీబ్రా లైన్‌పై రోడ్డు దాటుతుండగా ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు లింగమనేని సంజుష్ టీజీ 09 జీ 0666 నంబరు ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి భారతి ముఖిని బలంగా ఢీకొట్టాడు. ఆ వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడింది. ఆమె తల, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంజుష్ కారును నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడిపి మరణానికి కారణమైనట్లు తేల్చి, అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 106 (1) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంజుష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్ట్‌లు చేయగా నెగెటివ్ వచ్చిందని, అందువల్ల నోటీసులు ఇచ్చి వదిలేశామని పోలీసులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కేసు నుంచి సంజూష్‌ను తప్పించేందుకు, మరొకరిని కారు నడిపిన డ్రైవర్‌గా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. మొదట్లో కారు రిజి్రస్టేషన్ నంబర్ మాత్రమే బయటకు రావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ డ్రైవర్‌ను నిందితుడిగా చూపే యత్నాలు జరిగాయని సమాచారం.


