'యాక్సిడెంట్‌లో చ‌నిపోయింద‌ని ఫోన్ చేశారు' | Lingamaneni Sanjush Case Update, Bharati Mukhi Mother Speaks Out After Fatal Hyderabad Crash, Watch Video Inside For Details | Sakshi
Sakshi News home page

లింగ‌మ‌నేని సంజూష్ కేసు.. భారతి తల్లి ఆవేద‌న‌

Aug 22 2026 6:21 PM | Updated on Aug 22 2026 6:38 PM

Lingamaneni Sanjush Case: Bharati Mukhi mother speaks after fatal crash

హైద‌రాబాద్‌: 'ఇంత చిన్న వ‌య‌సులో నా కూతురు ఎలా చ‌నిపోయింది' అంటూ రోదిస్తోంది ఆనందిని ముఖి. జ‌న‌సేన ఎంపీ లింగ‌మ‌నేని ర‌మేశ్ కుమారుడు సంజూష్ కారు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన భార‌తి ముఖి త‌ల్లి ఆనందిని. కూతురి మ‌ర‌ణ‌వార్త తెలిసి ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒడిశాలో ఉంటున్న ఆమె మీడియాతో త‌న బాధ‌ను పంచుకుంది.

నాలుగైదేళ్లుగా హైద‌రాబాద్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని త‌న కూతురే పోషిస్తోంద‌ని, తామంతా ఆమెపైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నామ‌ని క‌న్నీరుమున్నీర‌యింది ఆనందిని. త‌మ కుటుంబానికి ఇక‌ దిక్కేవ‌ర‌ని రోదిస్తూ వాపోయింది. త‌న‌ కుమార్తె చావుకు కార‌ణం ఎవ‌రని దీనంగా ప్ర‌శ్నించింది.

''నా కూతురిని ఎంతో క‌ష్ట‌ప‌డి పెంచి, చ‌దివించాను. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్‌లో సీటు కూడా తెచ్చుకుంది. కోవిడ్ లాక్‌డౌన్‌తో బీటెక్ చేయ‌లేక‌పోయింది. దీంతో ఉద్యోగం కోసం హైద‌రాబాద్ వెళ్లింది. మాదాపూర్‌లో ఇనార్బిట్‌మాల్‌లో ప‌నిచేస్తూ మాకు నెల‌నెలా డ‌బ్బులు పంపిస్తోంది. భార‌తి సంపాద‌న మీదే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నాం. ఇంతలోనే ఘోరం జ‌రిగిపోయింది. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి.. భార‌తికి యాక్సిడెంట్ జ‌రిగింద‌ని చెప్పింది. భార‌తితో మాట్లాడించ‌మ‌ని అడిగితే.. చనిపోయింద‌ని చెప్పింది. మాకేం చేయాలో అర్థం కాలేదు. హైద‌రాబాద్ ఎలా వెళ్లాలో కూడా మాకు తెలియ‌దు. ఇంత చిన్న వయసులోనే నా కూతురు ఎలా చ‌నిపోయింది?'' అంటూ ఆనందిని శోక‌సంద్రంలో ముగినిపోయారు.

నెటిజ‌న్ల స్పంద‌న‌
భార‌తి ముఖి కుటుంబానికి న్యాయం చేయాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు. ఆనందిని ముఖి మీడియాతో మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు స్పందించారు. 'ఈ కన్నతల్లి ఉసురు మీకు తగులుతుంది. ఖ‌ర్మ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు' అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టారు. త‌మ పార్టీ ఎంపీ కొడుకు కార‌ణంగా ఓ యువ‌తి ప్రాణాలు కోల్పోతే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎందుకు స్పందించ‌లేద‌ని మ‌రొక‌రు ప్ర‌శ్నించారు. హైదరాబాద్‌లో వలస కార్మికులకు జరిగే ప్రమాదాలు/నేరాల విషయంలో బాధితుల ప‌క్షాన నిల‌బ‌డేవారు ఎవ‌రు ఉండ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని ఇంకో నెటిజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. 'ప్రజల నుంచి దొంగిలించిన డబ్బుతో కొన్న లింగ‌మ‌నేని సంజూష్ కారు ఆస్టన్ కిల్లర్ మెషీన్ ను వేలం వేసి, ఆ డబ్బును బాధితుల కుటుంబానికి చెల్లించాలి. అలాగే ఎంపీ లింగ‌మ‌నేని ర‌మేశ్ సంపద మూలాలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేయాల'ని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.

చ‌ద‌వండి: సంజూష్‌ను త‌ప్పించాల‌ని స్కెచ్‌!

తండ్రి ఎంపీ కాబ‌ట్టే.. 
భార‌తి ముఖి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన లింగ‌మ‌నేని సంజూష్‌ను (Lingamaneni Sanjush) కేసు నుంచి త‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఘ‌ట‌న జ‌రిగి వారం రోజులు కావొస్తున్న అత‌డిని అరెస్ట్ చేయ‌క‌పోవ‌డంపై అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. లింగ‌మ‌నేని ర‌మేశ్ ఎంపీ కాబ‌ట్టే ఆయ‌న కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయ‌డం లేద‌ని సోష‌ల్ మీడియాలో జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు. సామాన్యుల‌కో న్యాయం, పెద్ద‌ల‌కే న్యాయ‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి కేసులో నిందితుల‌ను అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు సాగించిన సంద‌ర్భాల‌ను గుర్తు చేస్తున్నారు. భార‌తి ముఖి చావుకు ప్ర‌త్య‌క్షంగా కార‌ణ‌మైన సంజూష్‌ను అరెస్ట్ చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement