యాపిల్‌లో ఉద్యోగాల కోత | Apple Job Cuts 2026 iPhone Maker Pivots AI Cuts 200 Jobs Siri Vision Pro Teams | Sakshi
Sakshi News home page

యాపిల్‌లో ఉద్యోగాల కోత

Aug 22 2026 11:51 AM | Updated on Aug 22 2026 11:55 AM

Apple Job Cuts 2026 iPhone Maker Pivots AI Cuts 200 Jobs Siri Vision Pro Teams

సాంకేతిక ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తన వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు చేస్తోంది. కృత్రిమ మేధ సవాళ్లు, మార్కెట్ ప్రతికూలతల నేపథ్యంలో కంపెనీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సిరి, విజన్ ప్రో ఇమ్మర్సివ్ వీడియో, గేమింగ్ విభాగాల నుంచి సుమారు 200 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

కంపెనీ ఉత్పత్తులు, సర్వీసుల నాణ్యతను పెంచేందుకు నిర్వహించే పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యాపిల్ అధికారికంగా ధ్రువీకరించింది. మారిన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని పాత హోదాలను రద్దు చేస్తూనే సరికొత్త విభాగాల్లో నూతన అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. బాధితులకు అవసరమైన మద్దతు అందిస్తామని పేర్కొంది.

తొలగింపుల్లో విజన్ ప్రో విభాగానికి చెందిన వారు 100 మంది ఉండగా, సిరి, సాఫ్ట్‌వేర్ టీమ్‌ల నుంచి మరో 100 మంది ఉన్నారు. 3,699 డాలర్ల డివైజ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన విజన్ ప్రో హెడ్‌సెట్‌కు ఆశించిన స్థాయిలో వినియోగదారులు లభించకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. కోట్లాది డాలర్ల వ్యయంతో రూపొందించే '3డీ ఇమ్మర్సివ్ వీడియో' కంటెంట్ తయారీ ఖర్చులను తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోంది. అలాగే విజన్ ప్రో గేమింగ్ విభాగాన్ని దాదాపుగా మూసివేస్తోంది. ఇకపై ఈ విధమైన కంటెంట్‌ను థర్డ్ పార్టీ డెవలపర్ల ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించింది.

అటు సిరి వాయిస్ అసిస్టెంట్‌ను మరింత ఆధునిక ఆర్కిటెక్చర్‌తో, కొత్త ఏఐ మోడల్స్‌ ఆధారంగా పునర్నిర్మించేందుకు యాపిల్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా పాత సాంకేతిక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల స్థానంలో నూతన ఏఐ నిపుణులను నియమించుకోవాలని భావిస్తోంది.

ఈ పరిణామాలు విజన్ ప్రో భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తించినప్పటికీ, 'విజన్ ఓఎస్' మనుగడలోనే ఉంటుందని యాపిల్ స్పష్టం చేసింది. తక్షణమే స్మార్ట్ గ్లాసెస్ ఆధారిత పరికరాలపై దృష్టి సారిస్తూ 2028 నాటికి కొత్త విజన్ ప్రో మోడల్‌ను పరిచయం చేసే ఆలోచనలో ఉంది. ఏఐ పోటీని తట్టుకుని నిలబడేందుకు యాపిల్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో కొత్త చర్చకు దారితీశాయి.

ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement