గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. తమ వాణిజ్య రహస్యాలను చోరీ చేసిందంటూ ఐఫోన్ మాతృసంస్థ యాపిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తక్షణమే కొట్టివేయాలని చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ యూఎస్ ఫెడరల్ కోర్టును అభ్యర్థించింది. తాము యాపిల్ ఉత్పత్తులకు పూర్తిగా భిన్నమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన సరికొత్త ఏఐ హార్డ్‌వేర్ వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపింది. యాపిల్ సీక్రెట్స్‌తో తమకు ఎలాంటి అవసరం లేదని న్యాయస్థానానికి స్పష్టం చేసింది.
క్యాలిఫోర్నియా నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన 31 పేజీల మోషన్‌లో ఓపెన్ ఏఐ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘యాపిల్ దావాకు తగిన ప్రాతిపదిక లేదు. ఏఐ రంగంలో తగినంత వేగంగా ఆవిష్కరణలు చేయలేకపోవడం, తమ అత్యుత్తమ ఇంజినీరింగ్ ప్రతిభావంతులను నిలుపుకోవడంలో విఫలం కావడమే యాపిల్ అసలు సమస్య. తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే యాపిల్ ఈ రకమైన వ్యూహాత్మక కేసులను నమోదు చేస్తోంది’ అని ఓపెన్ ఏఐ గట్టిగా వాదించింది.
గత జులైలో యాపిల్ కోర్టును ఆశ్రయిస్తూ.. తమ మాజీ ఉద్యోగులు, డిజైన్ హెడ్ టాంగ్ టాన్ వంటి వారి ద్వారా ఓపెన్ ఏఐ తమ హార్డ్‌వేర్ సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. అయితే, నైపుణ్యం కలిగిన నిపుణులను సాధారణ పారిశ్రామిక నిబంధనల ప్రకారమే నియమించుకున్నామని, ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధమైన ప్రక్రియ లేదని ఓపెన్ ఏఐ ప్రతిఘటించింది.
గతంలో ఐఫోన్ సాధనాల్లో ‘సిరి’, చాట్‌జీపీటీని అనుసంధానించేందుకు భాగస్వాములుగా పనిచేసిన ఈ రెండు సంస్థలు ఇప్పుడు రాబోయే తరం ఏఐ పరికరాల మార్కెట్‌పై ఆధిపత్యం కోసం ప్రత్యర్థులుగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్మార్ట్‌ఫోన్ల యుగాన్ని అధిగమించే కొత్త ఏఐ హార్డ్‌వేర్‌ను తీర్చిదిద్దడంలో ఓపెన్ ఏఐ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో యాపిల్ కలవరపడుతోందని కొందరు చెబుతున్నారు. కాగా, ఈ పిటిషన్‌పై వచ్చే అక్టోబరు 1న కోర్టులో కీలక విచారణ జరగనుంది.
ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు


