ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ వేగంగా విస్తరిస్తూ.. సైబర్ సెక్యూరిటీ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో.. టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరిశోధకులు ఒకేసారి సమర్పించగలిగే సెక్యూరిటీ రిపోర్టుల సంఖ్యపై పరిమితి విధించింది. దీనికి ప్రధాన కారణం.. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ సహాయంతో పెద్ద ఎత్తున భద్రతా లోపాలకు సంబంధించిన సమస్యలు రావడమే. దీంతో ప్రతి రిపోర్టును పరిశీలించడం యాపిల్ బృందానికి భారంగా మారిందని కంపెనీ తెలిపింది.
యాపిల్‌లో ప్రతి సెక్యూరిటీ రిపోర్టును నిపుణులు విడిగా పరిశీలించి, అందులో నిజంగా లోపం ఉందా?, లేదా?.. అనే విషయాన్ని నిర్ధారిస్తారు. కానీ.. ఇటీవల ఏఐ సృష్టించిన అనేక రిపోర్టుల్లో వాస్తవానికి సంబంధం లేని లేదా.. కేవలం ఊహాజనిత సమస్యలు ఎక్కువగా ఉండటంతో, వాటిని పరిశీలించడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగా నిజమైన భద్రతా లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే ప్రక్రియ ఆలస్యం కావచ్చని కంపెనీ భావించింది. అందుకే ఒకేసారి ఓపెన్‌గా ఉంచే సెక్యూరిటీ రిపోర్టుల సంఖ్యపై పరిమితి విధించడం జరిగింది.
అయితే.. ఏఐ వల్ల ప్రతికూలతలే కాకుండా ప్రయోజనాలు కూడా ఉన్నాయని యాపిల్ చెబుతోంది. కొన్ని ఏఐ సిస్టమ్‌లు మ్యాక్‌ఓఎస్‌లో చాలా తక్కువ సమయంలోనే 50కు పైగా సంభావ్య భద్రతా లోపాలను గుర్తించాయి. వాటిలో కొన్ని చాలా కీలకమైనవిగా ఉండటంతో యాపిల్ వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల ద్వారా వాటిని పరిష్కరించింది.
బగ్ బౌంటీ ప్రోగ్రామ్
ప్రస్తుతం యాపిల్ తన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా నిజమైన సెక్యూరిటీ లోపాలను గుర్తించిన పరిశోధకులకు లోపం తీవ్రతను బట్టి గరిష్ఠంగా 5 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని కూడా అందిస్తోంది. అయితే కొత్త పరిమితుల వల్ల భవిష్యత్తులో కొన్ని కీలకమైన నిజమైన రిపోర్టులు కూడా ఆలస్యంగా పరిశీలించే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


