ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ దేశీయ విఫణిలో ఇలా విభాగంలో ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, జెడ్ ఫ్లిప్ 8 ఫోన్లను కొనుగోలు చేసే వారికి కంపెనీ 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
శాంసంగ్ అందిస్తున్న ఈ 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో.. ఒకేసారి భారీ మొత్తం చెల్లించకుండా, నెలవారీ వాయిదాల రూపంలో డబ్బు చెల్లిస్తూ ఈ ప్రీమియం ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయడమే అని సంస్థ తెలిపింది.
గెలాక్సీ AI ఫీచర్లతో వచ్చే ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్లను జీరో డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈఎంఐ ఆఫర్‌లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రాను నెలకు రూ.6,667 చెల్లిస్తూ సొంతం చేసుకోవచ్చు. ఇక గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కోసం నెలకు రూ.6,000, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 కోసం నెలకు రూ.4,167 ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేయవచ్చు.
ఈ 30 నెలల నో-కాస్ట్ EMI సదుపాయం శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్, టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పూనావాలా ఫిన్‌కార్ప్ ద్వారా అందుబాటులో ఉంది. శాంసంగ్.కామ్, శాంసంగ్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, భాగస్వామ్య రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కూడా పొందవచ్చు.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ధర రూ.1,99,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది వైలెట్ షాడో, గ్రాఫైట్, క్రీమ్, గ్రీన్ షాడో రంగుల్లో లభిస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ధర రూ.1,79,999 నుంచి ప్రారంభమవుతుండగా, జెడ్ ఫ్లిప్ 8 ధర రూ.1,24,999 నుంచి మొదలవుతుంది. ఈ రెండు మోడళ్లలో కూడా పలు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.


