జెడ్ ఫోల్డ్ 8, అల్ట్రా, ఫ్లిప్ 8 మోడళ్లను ఆవిష్కరించిన శాంసంగ్
ఆగస్టు 7 నుంచి లభ్యం..
దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన గెలాక్సీ జెడ్8 సిరీస్‌లో ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8’, ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా’, ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8’ పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి ఈ ఫోన్ల ధరల శ్రేణి రూ. 1.25 లక్షల నుంచి రూ. 2.60 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది. భారత్‌లోనే తయారైన ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చే నెల (ఆగస్టు 7) నుంచి స్టోర్లలో లభించనున్నాయి. వీటి ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అప్‌గ్రేడ్ ఆఫర్ కింద రూ. 10,000 వరకు, అలాగే రూ. 9,000 బ్యాంక్/యూపీఐ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఎలాంటి డౌన్‌పేమెంట్ లేకుండా, నో– కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8
కేవలం 201 గ్రాముల బరువు, మడత విప్పినప్పుడు 4.5 మిమీ మందంతో ఎంతో తేలికగా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్ స్క్రీన్‌తో ఇది వస్తోంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రొసెసర్, 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్, డ్యూయల్ 50ఎంపీ రియర్ కెమెరా, 10ఎంపీ సెల్ఫీ కెమెరాలను అందించారు. 12జీబీ + 256జీబీ ధర రూ. 1,79,999, 12జీబీ + 512జీబీ ధర రూ. 1,99,999, 16జీబీ + 1టీబీ ధర రూ. 2,39,999 గా నిర్ణయించారు. ఇది క్రీమ్, గ్రాఫైట్, లావెండర్, పిస్తాచియో రంగుల్లో లభిస్తుంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా
215 గ్రాముల బరువు, మడత విప్పినప్పుడు కేవలం 4.1 మిమీ మందంతో అత్యంత స్లిమ్, లైట్ డిజైన్‌తో దీనిని తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌లో 8 అంగుళాల క్యూఎక్స్‌జీఏ ప్లస్ ప్రధాన డిస్‌ప్లే, 6.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ కవర్ స్క్రీన్ (120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్) ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రొసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ స్టోరేజ్, జెమిని లైవ్ వంటి గెలాక్సీ ఏఐ టూల్స్‌తో పనిచేస్తుంది. వెనుక వైపు 200ఎంపీ + 50ఎంపీ + 10ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ అందించారు. గ్రాఫైట్, క్రీమ్, వయొలెట్ షాడో, గ్రీన్ షాడో రంగుల్లో లభించే ఈ ఫోన్ ఆరంభ వేరియంట్ (12జీబీ+256జీబీ) ధర రూ. 1,99,999 కాగా, 12జీబీ+512జీబీ ధర రూ. 2,19,999, టాప్ వేరియంట్ (16జీబీ+1టీబీ) ధర రూ. 2,59,999గా నిర్ణయించారు.
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8
ఇందులో 6.9 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్ 2ఎక్స్ ప్రధాన డిస్‌ప్లేతో పాటు ఫోన్ తెరవకుండానే నోటిఫికేషన్లు చూసేందుకు, సెలీ్ఫల కోసం 4.1 అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ స్క్రీన్ అందించారు. ఎగ్జినోస్ 2600 చిప్‌సెట్, 12జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 17 (వన్ యూఐ 9) ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. వెనుక వైపు 50ఎంపీ + 12ఎంపీ డ్యూయల్ కెమెరా, ముందు 10ఎంపీ సెల్ఫీ కెమెరా, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. గ్రాఫైట్, క్రీమ్, పింక్, మింట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 1,24,999 కాగా, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 1,44,999గా నిర్ణయించారు.
‘3ఈ’ వ్యూహంతో మార్కెట్లోకి
భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్8’ ఫోల్డబుల్ సిరీస్ విక్రయాలను భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా శాంసంగ్ సరికొత్త 3ఈ వ్యూహాలను సిద్ధం చేసింది. విక్రయాలను పెంచేందుకు పంపిణీ వ్యవస్థను విస్తరించడంతో పాటు, వినియోగదారులకు 30 నెలల ‘నో–కాస్ట్ ఈఎంఐ’ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. వినియోగదారులకు ఉత్పత్తిని మరింత చేరువ చేయడమే ఈ వ్యూహం లక్ష్యమని కంపెనీ శాంసంగ్ ఇండియా ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్


