న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాల కోసం కాకుండా ఎగుమతులకు మాత్రమే ఉద్దేశించిన ఇన్వెŠంటరీ ఆధారిత ఈ–కామర్స్ సంస్థల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చిన్న రిటైలర్ల వ్యాపారం దెబ్బతినకుండా ఎగుమతులను పెంచుకునేందుకు ఇది సహాయపడనుంది. ఈ కంపెనీలు భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది.
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇది కూడా అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం బీ2బీ బిజినెస్ ఈ–కామర్స్, మార్కెట్‌ప్లేస్ మోడల్స్‌లో మాత్రమే విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. బీ2సీ (బిజినెస్ టు కన్జూమర్) ఈ–కామర్స్, ఆన్‌లైన్ రిటైలరు తానే స్వయంగా నిల్వ చేసుకుని వినియోగదారులకు నేరుగా విక్రయించే ఈ–కామర్స్ మోడల్స్‌లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు. భారత్ నుంచి ఈ–కామర్స్ ఎగుమతులు 2 బిలియన్ డాలర్లుగా ఉండగా, చైనావి ఏకంగా 350 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ–కామర్స్ వ్యాపారం 800 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.
4


