క్యూ1లో 12.2 శాతం వృద్ధి
ఆదాయం 14 శాతం అప్; రూ.48,211 కోట్లు
ఈ ఏడాది ఆదాయ గైడెన్స్ కట్...
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మిశ్రమ పనితీరును నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.7,769 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 6,921 కోట్లతో పోలిస్తే లాభం 12.2% పెరిగింది. మొత్తం ఆదాయం 14% వృద్ధితో రూ. 48,211 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 42,279 కోట్లుగా ఉంది.
సీక్వెన్షియల్‌గా.. ప్చ్
గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో నమోదైన లాభం రూ. 8,501 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా ఈ ఏడాది క్యూ1లో 8.6 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం స్వల్పంగా 3.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్యూ4లో కంపెనీ రూ. 46,402 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
గైడెన్స్ కోత..
ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో 2026–27 పూర్తి ఏడాది ఆదాయం వృద్ధి అంచనాల్లో (గైడెన్స్) ఇన్ఫీ కోత విధించింది. ఆదాయ గైడెన్స్‌ను 1.5–3 శాతానికి తగ్గించింది. గతంలో ఆదాయ వృద్ధి 1.5–3.5 శాతంగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది.
ఇతర ముఖ్యాంశాలివీ...
→ క్లయింట్ల కోసం కంపెనీలో 80,000 మంది సిబ్బంది ఏఐ కోడింగ్ టూల్స్ ఉపయోగిస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో 6,000 మంది ఏఐ ఫ్రాంటియర్ ఇంజినీర్ల టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ఇన్ఫీ పేర్కొంది.
→ జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగులు సంఖ్య 3,28,062కు చేరింది. మార్చినాటికి సిబ్బంది సంఖ్య 3,28,594తో పోలిస్తే 532 మంది తగ్గారు. ఉద్యోగుల
వలసల (అట్రిషన్) రేటు 13%గా నమోదైంది.
→ ఉద్యోగులకు వేతనాల పెంపు విషయానికొస్తే అక్టోబర్, జనవరి (సీనియర్లకు)లో రెండు విడతల్లో ఉంటుందని కంపెనీ తెలిపింది.
→ క్యూ1లో 4,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని కంపెనీ వెల్లడించింది, గతేడాది మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చే ప్రణాళికల్లో ఉన్నామని వెల్లడించింది.
→ క్యూ1 ఆదాయంలో ఏఐ సర్వీసుల వాటా 8.5 శాతానికి పెరిగింది.
→ 3.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంది.
ఇన్ఫోసిస్ షేరు ఫ్లాట్‌గా రూ.1,052 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఇన్ఫీ ఏడీఆర్ 4 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది.
ఏఐ జోరు ఇప్పుడు ఆదాయం వనరుగా మారుతోంది. ఎంటర్‌ప్రైజ్ ఏఐని అమలు చేయడం ద్వారా ఇన్ఫోసిస్ స్థిరమైన మార్కెట్ వాటాను దక్కించుకుంటోంది. పటిష్టమైన భారీ డీల్స్ కుదరడం కంపెనీపై క్లయింట్ల నమ్మకానికి నిదర్శనం. దాదాపు అన్ని దిగ్గజ ఏఐ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం, నవకల్పనల ఎకోసిస్టమ్‌ను అందించడం ద్వారా క్లయింట్లు తమ నిర్వహణ ఉత్పాదకతను పెంచుకోవడంలో, వృద్ధి అవకాశాలను అన్‌లాక్ చేయడంలో తోడ్పాటునందిస్తున్నాం.మా ఉద్యోగులందరికీ ఏఐ నైపుణ్యాలను పెంచడానికి కట్టుబడి ఉన్నాం. ఒక క్లయింట్ నిర్ణయం కారణంగా ఆదాయంపై అసాధారణ (వన్‌టైమ్) ప్రభావం పడింది. 
– సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ


