డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ. 435 కోట్లు | Dr Reddys Q1 net profit falls 69percent to Rs 443 crore | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ. 435 కోట్లు

Jul 23 2026 5:23 AM | Updated on Jul 23 2026 5:23 AM

Dr Reddys Q1 net profit falls 69percent to Rs 443 crore

క్యూ1లో ఆదాయం రూ. 8,070 కోట్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సుమారు రూ. 435 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 1,410 కోట్లతో పోలిస్తే లాభం ఏకంగా 69 శాతం మేర క్షీణించింది. సెమాగ్లూటైడ్‌ ఏపీఐలకు సంబంధించిన కేటాయింపులపరంగా ప్రతికూల ప్రభావం పడటం, ఉత్తర అమెరికా మార్కెట్లో జనరిక్స్‌ ఆదాయం నెమ్మదించడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 8,545.2 కోట్ల నుంచి రూ. 8,070.5 కోట్లకు తగ్గింది. 

వ్యయాలు రూ. 3,115 కోట్ల నుంచి రూ. 3,376 కోట్లకు చేరాయి. పెప్టైడ్స్, బయోసిమిలర్స్, వినూత్న అసెట్స్‌ని రూపొందిస్తూనే క్రమశిక్షణతో వ్యూహాలను అమలు చేయడం, అత్యుత్తమ నిర్వహణ ప్రమాణాలు పాటించడం ద్వారా అధిక వృద్ధి సాధించడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు.జనరిక్స్‌ దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు పెంచిన పక్షంలో అక్కడ ఔషధాల ధరలు పెరుగుతాయని సంస్థ సీఈవో ఎరెజ్‌ ఇజ్రేలీ తెలిపారు. అమెరికా మార్కెట్‌ కోసం తయారీ కార్యకలాపాలను పూర్తిగా అక్కడికి మార్చడం ఆచరణసాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.  

క్యూ1 ఇతర విశేషాలు..  
→ గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 7,562 కోట్ల నుంచి 
రూ. 7,199 కోట్లకు తగ్గింది. ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం ఏకంగా 35 శాతం తగ్గి రూ. 3,412 కోట్ల నుంచి రూ. 2,205 కోట్లకు క్షీణించింది.  
→ ఫార్మా సర్వీసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 4 శాతం వృద్ధితో రూ. 818 కోట్ల నుంచి రూ. 852 కోట్లకు చేరింది.  
బుధవారం బీఎస్‌ఈలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు సుమారు 2% క్షీణించి రూ. 1,183 వద్ద క్లోజయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement