క్యూ2లో రూ. 1,437 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా రంగ హైదరాబాద్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 15 శాతం ఎగసి రూ. 1,437 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,255 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 8,016 కోట్ల నుంచి రూ. 8,805 కోట్లకు బలపడింది.
బ్రాండెడ్ మార్కెట్లలో పుంజుకున్న అమ్మకాలు క్యూ2లో పటిష్ట పనితీరుకు సహకరించినట్లు కంపెనీ కోచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. యూఎస్‌లో లెనలిడొమైడ్ అమ్మకాలు క్షీణించినప్పటికీ ప్రధానంగా నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(ఎన్‌ఆర్‌టీజే పోర్ట్‌ఫోలియో) నుంచి సాధించిన ఆదాయం ఇందుకు సహకరించినట్లు వెల్లడించారు. కంపెనీకి కీలకమైన విభాగాలను పటిష్టపరచడం, ఉత్పాదకతను పెంచడం, వ్యాపార అభివృద్ధి ప్రణాళికలకు తెరతీయడం తదితరాలపై దృష్టిపెట్టినట్లు తెలియజేశారు.
యూరప్ ఆదాయం జూమ్: ఉత్తర అమెరికా జనరిక్స్ (ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్టుల ధరల క్షీణత, లెనలిడొమైడ్ అమ్మకాలు తగ్గడం) మినహా మిగిలిన కీలక మార్కెట్లలో పటిష్ట వృద్ధి నమోదైనట్లు డాక్టర్ రెడ్డీస్ వివరించింది. ఉత్తర అమెరికా అమ్మకాలు 13 శాతం నీరసించి రూ. 3,241 కోట్లకు పరిమితంకాగా.. యూరప్ నుంచి ఆదాయం రెట్టింపై రూ. 1,376 కోట్లకు చేరింది. దేశీయంగా అమ్మకాలు 13 శాతం వృద్ధితో రూ. 1,578 కోట్లను తాకాయి. వర్ధమాన మార్కెట్ల ఆదాయం 14 శాతం పురోగమించి రూ. 1,655 కోట్లకు చేరాయి. ఫార్మాస్యూటికల్ సర్వీసులు, యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్(పీఎస్‌ఏఐ) బిజినెస్ 12 శాతం
పుంజుకుని రూ. 945 కోట్లయ్యింది.
డాక్టర్ రెడ్డీస్ షేరు 0.3% లాభపడి రూ. 1,284 వద్ద ముగిసింది.


