క్యూ4లో 102.5 బిలియన్ డాలర్లు
వాషింగ్టన్: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ4)లో 102.5 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. వార్షిక ప్రాతిపదికన ఇది 8 శాతం అధికంకాగా.. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి ఒక క్వార్టర్‌లో 100 బిలియన్ డాలర్ల టర్నోవర్‌ను అధిగమించింది. ప్రధానంగా ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ అమ్మకాలు దన్నుగా నిలిచినట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలియజేశారు. ప్రపంచంలోనే రెండో పెద్ద స్మార్ట్‌ఫోర్ మార్కెట్‌గా నిలుస్తున్న భారత్‌లోనూ రికార్డ్ అమ్మకాలు సాధించినట్లు కుక్ పేర్కొన్నారు.
యూఎస్, కెనరా, లాటిన్ అమెరికా, పశి్చమ యూరప్, మధ్యప్రాచ్యం, జపాన్ తదితర పలు ప్రాంతాలలో అమ్మకాలు జోరందుకున్నట్లు వెల్లడించారు. గత కొద్ది నెలలుగా భారత్, యూఏఈ తదితర వర్ధమాన మార్కెట్లలో కొత్త స్టోర్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆదాయంలో ఐఫోన్ల విక్రయాల ద్వారా 49 బిలియన్ డాలర్లు అందుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో కెవన్ పరేఖ్ పేర్కొన్నారు. ఇది 6 శాతం వృద్ధి కాగా.. పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 416 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. కంపెనీ అక్టోబర్–సెపె్టంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.


