ప్రీలోడ్ ఆదేశాలపై వెనక్కి తగ్గిన కేంద్రం
సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్ ఇన్‌స్టాల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రీ-ఇన్‌స్టాల్‌పై డాట్ పట్టు
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్, శామ్‌సంగ్, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ల్లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..
డూప్లికేట్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్‌లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.
జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్‌లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.
ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.
యాపిల్ గోప్యతా ప్రమాణాలు
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్ ప్లాట్‌ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్‌కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్‌సంగ్, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ..


