యాపిల్ కంపెనీ సీఈఓగా టిమ్ కుక్ వైదొలగనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో, సంస్థ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కొత్త వైస్ ప్రెసిడెంట్‌గా 'అమర్ సుబ్రమణ్య' నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న జాన్ జియానాండ్రియా స్థానంలో అమర్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన (జాన్ జియానాండ్రియా) పదవీ విరమణ చేసేవరకు సలహాదారుగా కొనసాగుతారు.
ఏఐ రేసులో.. ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ కొంత వెనుకబడి ఉంది. ప్రత్యర్థులకు ధీటుగా ఎదగాలంటే.. తప్పకుండా ఏఐపై ద్రుష్టి పెట్టాలి. కాబట్టి సంస్థ.. వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలను అమర్ సుబ్రమణ్యకు అప్పగించింది. కాగా ఈయన యాపిల్ ఫౌండేషన్ మోడల్స్, ఎంఎల్ రీసర్చ్, ఏఐ సేఫ్ట్ అండ్ ఎవాల్యువేషన్ వంటి విభాగాలకు కూడా సారథ్యం వహించనున్నారు.
ఎవరీ అమర్ సుబ్రమణ్య?
ఏఐ రంగంలో గొప్ప అనుభవం ఉన్న.. అమర్ సుబ్రమణ్య, 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత IBMలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరాడు. 2005లో వాషింగ్టన్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. కొన్ని నెలలు మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ పనిచేశారు.
పీహెచ్‌డీ పూర్తయిన తరువాత.. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్‌లో స్టాఫ్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరాడు. ఎనిమిది సంవత్సరాల తర్వాత, అతను ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా, తరువాత 2019లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందాడు. కొంతకాలం తరువాత ఏఐ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా మైక్రోసాఫ్ట్‌కు మారాడు. గూగుల్‌లో 16 సంవత్సరాల పని చేసిన తరువాత.. సుబ్రమణ్య ఇప్పుడు ఆపిల్‌లో సీపీవీగా చేరారు.


