కృత్రిమ మేధస్సు (AI)తో సృష్టించే కంటెంట్‌ను ఈ మధ్యకాలంలో ఎందుకూ పనికి రాని విషయంగా(AI slop) చాలామంది తిడుతున్నారు. అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా.. అందునా అశ్లీలమైన కంటెంట్ వైరల్ అవుతుండడమే అందుకు కారణం. పైగా ఒరిజినాలిటీని దెబ్బ తిస్తోందని విమర్శిస్తున్నారు. కానీ అదే సాంకేతికతను వినోదం కోసం ఉపయోగిస్తే ఆ కిక్కే వేరప్పా.
ఏఐ కంటెంట్‌ను ఇప్పుడున్న యూత్ ఎలా ఉపయోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలూ వాళ్ల పనితీరు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అయితే.. ఇక్కడ మాత్రం ఓ కూతురు తన తల్లిని ఆటపట్టించింది. లేని బాయ్‌ఫ్రెండ్‌ను సృష్టించి.. తల్లికి పిచ్చి కోపం తెప్పించింది. అలా నెట్టింట నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళ్తే..
యూపీ లక్నోకు చెందిన పావని అవస్థి తన తల్లిని సరదాగా మోసం చేసింది. చాట్‌జీపీటీ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోను తల్లికి చూపించి బిత్తర పోయేలా చేసింది. ఆపై వాళ్ల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అని తల్లి ప్రశ్నించగా.. తన బాయ్‌ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. అవునా.. అతను నీ స్నేహితుడా?.. ఎప్పటి నుంచి మీరు స్నేహితులు? అంటూ ఆందోళనలతో ప్రశ్నలు గుప్పించి.. చాలాకాలంగా తెలుసని, మంచోడు అని, ఇంకా కొన్నిరోజుల్లో ఇంటికి వస్తాడు కదా అంటూ పావని సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయం నీ తండ్రికి తెలిస్తే బాగోదని.. ఆయన ఏమాత్రం సంతోషించరని కోపంగా మాట్లాడి లాగిపెట్టి కొట్టింది. ఫోన్ విసిరేయబోతుండగా.. సీన్ కట్ అయ్యింది.
తన తల్లిని ఏఐతో ఎలా బురిడీ కొట్టించిందో తెలియజేస్తూ పావని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో దగ్గర దగ్గర 4 మిలియన్ల(4M) వ్యూస్ వచ్చాయి. ఈ ప్రాంక్‌ను ఆస్వాదించిన వాళ్లంతా.. సరాదాగా కామెంట్లు పెడుతున్నారు. నేను AIని అసహ్యించుకునే వాడిని. కానీ ఇది అద్భుతమైన వినియోగం అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ హైలైట్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. మరో ఘటనలో ఒక మనవడు తన తాతయ్య 90వ పుట్టినరోజు సందర్భంగా AI సాంకేతికతను వినియోగించి ప్రత్యేకమైన వీడియోను రూపొందించాడు. పాత కుటుంబ ఫోటోలను ఉపయోగించి, వాటిని కదిలే జ్ఞాపకాలుగా మార్చి తాతయ్య జీవితకథను చూపించాడు. ఆ వీడియో చూసిన తాతయ్య మాటలు రానంతగా భావోద్వేగానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. AIని కేవలం నిరుపయోగమైన కంటెంట్ సృష్టించే సాధనంగా కాకుండా, సరదా, భావోద్వేగం, కుటుంబ బంధాలను మరింత బలపరచే సాధనంగా కూడా ఉపయోగించవచ్చని ఈ వీడియో చూసిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.


