ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు.. కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) పరిధిలోని.. సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం రూపొందించిన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' (SOP)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఆమోదం తెలిపింది.
కొత్త ఎస్‌ఓపీ ప్రకారం.. రూ. 50వేలు కంటే తక్కువ సైబర్ మోసాల బాధితులు కోర్టు ఆదేశం లేకుండానే రీఫండ్ పొందవచ్చు. అయితే కోర్టు ఆదేశాలు లేని సందర్భాల్లో, బ్యాంకులు గరిష్టంగా 90 రోజుల్లోగా ఫ్రీజ్ చేసిన మొత్తాలపై హోల్డ్‌ను ఎత్తివేయాల్సి ఉంటుంది. దీని వల్ల బాధితులు ఎదుర్కొంటున్న ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల ఫిర్యాదులు కూడా అధికమయ్యాయి.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గణాంకాల ప్రకారం.. గత ఆరు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మోసం, మభ్యపెట్టడం వంటి కేసుల ద్వారా రూ. 52,976 కోట్లకు పైగా నష్టం సంభవించింది. ఈ కొత్త విధానం ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్ద ఊరటగా నిలవనుంది. ఈ నిర్ణయాన్ని ఫిన్‌టెక్ & డిజిటల్ ఫైనాన్స్ రంగ నిపుణులు స్వాగతించారు.
ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!


