న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులకు గుడ్‌న్యూస్..! 8వ వేతన సంఘం ఉద్యోగులకు భారీ ఊరట కల్పించనుందనే వార్తలు వెలువడుతున్నాయి. కరువు భత్యం(డీఏ) 3-5% మేర పెరిగి.. మూలవేతనంపై 70శాతానికి చేరుకోనున్నట్లు ఆర్థిక నిపుణులు, ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. 2025 జూలైలో డీఏ 58శాతంగా ఉంది.
మోదీ సర్కారు 8వ వేతన సంఘం ద్వారా 3-5% మేర డీఏను రాబోయే కేంద్ర బడ్జెట్‌లో పెంచనున్నట్లు ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. ఈ ప్రకటన వెలువడగానే.. ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది. ఒక్కసారి డీఏను ప్రకటిస్తే.. వెంటనే అమల్లోకి వచ్చినా, ఉద్యోగుల వేతనాల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే.
అయితే.. ఏటా ఆ మేరకు డీఏ పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన ఈ ఏడాది 63శాతానికి చేరనున్న డీఏ.. అది పూర్తిస్థాయిలో అమలయ్యేనాటికి.. అంటే.. వచ్చే ఏడాది ప్రథమార్థానికి 70శాతానికి చేరుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొత్త డీఏ అమలైతే.. కనీస వేతనాలు భారీగా పెరిగే అవకాశాలుంటాయి. అయితే ఇది 5వ, 6వ వేతన కమిషన్‌లతో పోలిస్తే చాలా తక్కువ. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంపై 74 శాతం (1996–2006), 124 శాతం (2006–2016) డీఏ పొందారు.


