మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు
ఒక్క డీఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలి?
పెండింగ్‌లో రూ.34 వేల కోట్ల బకాయిలు
సంక్రాంతిలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి
కడప రూరల్: ప్రభుత్వ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే పతనం తప్పదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగకు ముందు సీఎం చంద్రబాబు ఒక డీఏ ఇచ్చి పండుగ చేసుకోమని చెప్పారని, ఆ ఒక్క డీఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు దాదాపు రూ.34 వేల కోట్ల బకాయిలు ఉంటే చంద్రబాబు రూ.210 కోట్లను రెండు విడతలుగా ఇస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారన్నారు. పోలీసులకు 6 సరెండర్ లీవులను పెండింగ్ పెట్టిన ఘనచరిత్ర చంద్రబాబు సర్కారుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 11వ తేదీ వరకు జీతాలు పడని పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రానికి ఏ వైరస్ సోకింది?
గత ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో 80 శాతం తొలి ఏడాదిలోనే అమలు చేసిందని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ఇపుడు రాష్ట్రానికి ఏ వైరస్ సోకిందని హామీలు నెరవేర్చడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారన్నారు. ఈ ప్రభుత్వానికి పీఆర్సీని నియమించే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఐఆర్, డీఏ ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ పథకం సక్రమంగా అమలుకు నోచుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఉద్యోగులపై వేధింపులు సైతం ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు 158 యాప్‌లను ఒక్క యాప్‌గా చేయడం దారుణమన్నారు. సంక్రాంతిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాల ద్వారా సాధించుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సమాఖ్య కో–చైర్మన్ లెక్కల జమాల్‌రెడ్డి, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, వల్లెం శివశేషాద్రిరెడ్డి, వల్లెం సుబ్బారెడ్డి పాల్గొన్నారు.


