ఐఆర్ లేదు, డీఏ బకాయిల చెల్లింపు అంతకన్నా లేదు
పీఆర్సీ వేయాలనే ధ్యాస లేకుండా తాత్సారం
డీఏ బకాయిలు మూడువిడతల్లో ఇస్తామని అరకొరగా విదిలింపు
ఉద్యోగులకు రూ.34 వేల కోట్లు బకాయిలుంటే ఇచ్చింది రూ.1,100 కోట్లు
దీనికే ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతి కట్టుకథలు
ఏపీజీఈఎఫ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రతి సంక్రాంతికి ఉద్యోగులను మోసం చేయడమే అలవాటుగా మార్చుకుందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. పెద పండుగకైనా ఐఆర్ ఇవ్వకపోతుందా అని, డీఏ ప్రకటిస్తుందేమోనని ఉద్యోగులు ఎదురుచూసి అలిసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను ఊరించి ఉసూరుమనిపించడంలో మాత్రమే ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తోందని ఎద్దేవా చేశారు.
గత ఏడాది సంక్రాంతి కానుకగా పోలీసులకు రెండు సరెండర్ లీవ్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించి.. కేవలం ఒకటి మాత్రమే ఇచ్చి రెండోది ఇవ్వకుండా మోసం చేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత దీపావళికి స్వయంగా సీఎం చంద్రబాబు మరోసారి పోలీసులకు సరెండర్ లీవ్ బిల్లు చెల్లిస్తామని ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశార న్నారు. చివరికి ఈ సంక్రాంతికి కూడా ప్రభుత్వం పోలీసులకు మొండిచెయ్యి చూపించిందని తెలిపారు.
ఓపీఎస్ ఉద్యోగులకు గత ప్రభుత్వమే ఇచ్చింది
‘ఇప్పుడు కూడా సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్ బిల్స్ చెల్లిస్తామని ప్రకటించి.. చెల్లింపులు చేయకుండా మరోసారి నట్టేటముంచింది. డీఏకి సంబంధించి 30 నెలల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. వీటిని మూడువిడతల్లో ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లలోకి జమచేసి, సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ బకాయిలను గత ప్రభుత్వమే ఓపీఎస్ ఉద్యోగులకు మూడువిడతలను మొత్తం వారి జీపీఎఫ్ అకౌంట్లకు జమచేసింది. ఇప్పుడు కేవలం సీపీఎస్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన 2018 జూలై డీఏ బకాయిలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ డీఏ చెల్లింపులకు కూడా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని పాటించటంలేదు. చిత్రవిచిత్రంగా కొందరికి ఒక్కవిడత నగదు కూడా జమకాలేదు. కొందరికి ఒకవిడత, కొందరికి రెండువిడతలు, ఇంకొందరికి మూడువిడతలు, అక్కడక్కడా ఒకరిద్దరికి ఆరువిడతలు కూడా జమైనట్టు తెలిసింది. నెల్లూరులో టీచర్లకు, యూనివర్సిటీ ఉద్యోగులకు, డాక్టర్లకు ఇలా అనేక రంగాల్లో వారికి డీఏ బకాయిలు పడలేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి కొన్ని పత్రికలు ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.70 వేలు – రూ.80 వేలు జమైనట్టు, ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారని ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు రాయడం సిగ్గుచేటు.
ఉద్యోగులకు రూ.34 వేలకోట్ల బకాయిలు ఉంటే అందులో కేవలం రూ.1,100 కోట్లు చెల్లిస్తామనగానే ఉద్యోగులు ఎగిరి గంతేసి సంబరాలు చేసుకుంటున్నారా? ఉద్యోగులకు 20 నెలలు అయినా ఐఆర్ ఇవ్వలేదు, కనీసం పీఆర్సీ వేయలేదు. పోలీసులకు రికార్డు స్థాయిలో ఐదు సరెండర్‌లీవ్ బిల్లులు పెండింగ్ ఉంటే, పెన్షనర్లకు 20 నెలలుగా గ్రాట్యుటీ చెల్లించని ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ కథనాలు ప్రచురించడం సమంజసం కాదు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులకు 2018 జూలై, 2019 జనవరి డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.


