ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) ఉదయం గం. 11లకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉభయ సభల్లో సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన ఆర్థికసర్వే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామాన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం వచ్చింది. అయితే ఇలా ఆదివారం రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
జనవరి 28 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుండగా, మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు.
ఇదిలా ఉంచితే, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, ఎస్‌ఐఆర్‌లపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ రంగాల్లో సంస్కరణల కోసం పలు కీలక బిల్లులను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జేపీసీ పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికల కోసం 129 రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఈసారి పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును కూడా ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.


