ఒక డీఏ విడుదల చేసినట్లుగా చంద్రబాబు సర్కారు హడావుడి
పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్లుగా ప్రచారం
కానీ, ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగి ఖాతాలోనూ పైసా పడలేదు
సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం.. సంక్రాంతికి తీపి కబురంటూ దానికీ ఎగనామం
4 డీఏలు పెండింగ్... ఒకదాన్ని3 విడతల్లో ఇస్తామని 3 నెలల క్రితం చంద్రబాబు ప్రకటన.. అందులో ఒకటి ఇప్పుడు పండుగ కానుకట? అదీ పడలేదని ఉద్యోగుల గగ్గోలు
పోలీసులకు బకాయి ఉన్న 2 సరెండర్ లీవుల్లో ఒకటి ఇచ్చామని గొప్పలు
తమ ఖాతాల్లో జమ కాలేదంటున్న పోలీసులు.. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటికీ బాబు తూట్లు
ఐఆర్, పీఆర్సీ వాగ్దానాలన్నీ బుట్టదాఖలు.. ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం
చంద్రబాబు హయాంలో డీఏల కోసం పడిగాపులు.. మొత్తం బకాయిలు సుమారు రూ.35 వేల కోట్లు
వాటిపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనా?
కానుకలు కాదు మాయ
‘‘వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే... హామీ ప్రకారం పది రోజుల్లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. గెలిచాక వాటిని పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల ఆందోళన పెరిగిపోతుండడంతో ఏదో ఒక మాయ చేస్తున్నారు. దీపావళి కానుక, సంక్రాంతికి తీపి కబురు అంటూ కాలక్షేపం కబుర్లు చెబుతున్నారు తప్ప, మా ఖాతాల్లో మాత్రం డబ్బులు పడడం లేదు’’ - ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ ఝలక్ ఇచ్చారు. పండుగ కానుకగా ఒక డీఏ, పోలీసులకు బకాయి ఉన్న ఒక సరెండర్ లీవు సొమ్మును విడుదల చేసినట్లు సోమవారం రాత్రి ప్రకటించినా... మంగళవారం సాయంత్రం వరకు ఏ ఒక్క ఉద్యోగికి ఆ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. దీంతో అసలు జమ అవుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బకాయిల విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు సంక్రాంతి కానుక గత ఏడాది ఇచ్చిన దీపావళి ఉత్తుత్తి కానుక వంటిదేనని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు.
ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఇచ్చామని చెబుతున్న మొత్తం గత ఏడాది దీపావళి కానుకగా ఇవ్వాల్సి ఉంది. దీనిపై అప్పట్లో... చంద్రబాబు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశమై నానా హంగామా చేశారు. బకాయి ఉన్న నాలుగు డీఏల్లో ఒకటి, పోలీసులకు పెండింగ్‌లో ఉన్న రెండు సరెండర్ లీవ్‌లను రెండు విడతలుగా ఇస్తామని ప్రకటించారు. అయితే, అందుకు విరుద్ధంగా... వెంటనే ఇస్తామన్న డీఏను రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలతో కలిపి ఇస్తామని జీవోలు జారీ చేశారు. పెన్షనర్లకు మూడు విడతలుగా ఇస్తామని మరో జీవో ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు భగ్గుమనడంతో తనకు తెలియకుండా జరిగిందంటూ చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. డీఏను 2026, 2027 సంవత్సరాల్లో నాలుగు విడతలుగా ఇస్తామని జీవోను సవరించారు.
దీపావళి కానుకే సంక్రాంతి తీపి కబురు
నాలుగు విడతల్లో ఇస్తామన్నదాంట్లో... ఒక విడత మొత్తాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రస్తుతం ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ, అది కూడా తమకు రాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో సంక్రాంతి కానుక మళ్లీ వచ్చే ఏ పండుగకో అని వెటకారంగా చర్చించుకుంటున్నారు.
⇒ పోలీసుల సరెండర్ లీవుల్లో రెండింటిని గత డిసెంబర్‌లోపు రెండు విడతలుగా ఇవ్వాల్సి ఉంది. అందులో ఒకటి ఈ పండుగ కానుకగా ఇస్తున్నట్లు చెప్పారేమోనని భావించినా అదీ పడలేదు.
⇒ చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలని్నంటినీ గాలికొదిలేశారని, బకాయిలను దీపావళి కానుక అని చెప్పి అప్పుడు ఇవ్వనేలేదని అంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుక అని మభ్యపెడుతుండడంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. నాలుగు డీఏల్లో ఒక్కటి ఇవ్వడానికి ఏడాదిన్నర తర్వాత ఒప్పుకొని దాన్నీ ఇవ్వకుండా నయవంచన చేస్తున్నారని మండిపడుతున్నారు. తమకు రావాల్సిన డీఏ బకాయిలు ఇవ్వకుండా కానుకలంటూ వాయిదాలు వేయడం ఏమిటని నిలదీస్తున్నారు.
ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన వైఎస్ జగన్.. 2014–19 మధ్య బాబు పాలనలో 7 డీఏలే
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా డీఏల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడక తప్పడం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పుడు కూడా ఒక్క డీఏ ఇవ్వడానికి గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడుతున్నారు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చారని, చంద్రబాబు 2014–19 కాలంలో ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఐఆర్ ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా గెలిచాక పట్టించుకోలేదు.
ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధం అవుతుండడంతో 14 నెలల తర్వాత దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. అందులో చెప్పిన మాటలు కూడా అమలు చేయకుండా కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, ఇప్పుడు దానిగురించి కనీసం మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. పీఆర్సీ ఇచ్చే ఆలోచన కూడా లేనట్లుంది. అందుకే... కమిషనర్ రాజీనామా చేసినా ఏడాదిన్నరగా మరొకరిని నియమించలేదు. 12వ పీఆర్సీ కమిషన్ ఉనికిలో లేదు. కమిషన్ నియమించడానికే చంద్రబాబు సిద్ధంగా లేనందున.... పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది.
పెండింగ్ బకాయిలు రూ.35 వేల కోట్లు
ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.35 వేల కోట్లు ఉన్నా ఇప్పటివరకు ఎంత విడుదల చేశారో చంద్రబాబు చెప్పడం లేదు. వీటిలో ఎప్పుడు ఎంత ఇస్తారో చెప్పకపోవడాన్ని బట్టి ఉద్యోగులు ఈ విషయంలోనూ మోసపోయినట్లుగా భావిస్తున్నారు.
⇒ పోలీసుల రెండు సరెండర్ లీవుల్లో ఒకటి రూ.110 కోట్లు ఇప్పుడు ఇచ్చినట్లు చెబుతున్నా ఎవరికీ జమకాలేదు. ఒక డీఏ బకాయిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చామంటున్నా ఖాతాల్లో పడలేదు. ఈ రెండు మినహాయించినా ఇంకా రూ.33,780 కోట్లు ఎప్పటికి వస్తాయోనని ఉద్యోగులు వాపోతున్నారు. టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన అందరికీ ఆమోదయోగ్య విధానాన్ని తెస్తామని ప్రకటించారు. కానీ, ఇంకా ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కూడా అందులో ఉన్న చిన్న మెలికను సాకుగా చూపుతూ మొత్తం వ్యవహారాన్నే పక్కన పెట్టేశారు.
⇒ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేయగా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారు. ఒక్క ఉద్యోగిని కూడా క్రమబద్ధీకరించలేదు. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై పాత విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆప్కాస్‌ను ఎత్తివేయడానికి సిద్ధం అవుతుండడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దారుణంగా వేధిస్తున్నారు. వారికి పండుగ నాడు తీపి కబురు అని చెబుతున్న మాటలు ప్రచారమేనని స్పష్టమవుతోంది.


