22–24 మధ్య పబ్లిక్ ఇష్యూ
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ కంపెనీ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానుంది. 24న ముగియనున్న ఇష్యూకి తాజాగా రూ. 108–114 ధరల శ్రేణి ప్రకటించింది. దీనిలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా దాదాపు రూ. 251 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్టర్లు కనీసం 128 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఈక్విటీ జారీ నిధులను అహ్మదాబాద్‌లోని పరేఖ్స్ హాస్పిటల్ కొనుగోలుతోపాటు.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్ సెంటర్ పాక్షిక చెల్లింపులకు వెచ్చించనుంది. అంతేకాకుండా వడోదరలో కొత్త ఆసుపత్రి ఏర్పాటు, రోబోటిక్స్ పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులకు సైతం నిధులు కేటాయించనుంది. కంపెనీ గుజరాత్‌లో మధ్యస్థాయి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్‌ను నిర్వహిస్తోంది.


