ఫెడ్‌ నిర్ణయాలపై మార్కెట్ల దృష్టి | Stock Market Experts Views and Advice | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ నిర్ణయాలపై మార్కెట్ల దృష్టి

Oct 27 2025 6:34 AM | Updated on Oct 27 2025 7:59 AM

Stock Market Experts Views and Advice

ఈ నెల 28–29 మధ్య పాలసీ సమావేశాలు 

డాలరు మారకం, ముడిచమురు ధరలకూ ప్రాధాన్యం 

క్యూ2 ఫలితాలు సెంటిమెంటుకు కీలకం 

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై నిపుణుల అంచనా

ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ వారం పాలసీ సమీక్షను చేపట్టనుంది. మరోపక్క దేశీయంగా పలు కార్పొరేట్‌ దిగ్గజాలు జూలై–సెపె్టంబర్‌(క్యూ2) ఫలితాలు ప్రకటించనున్నాయి. వీటితోపాటు పలు కీలక అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. 

ఫెడ్‌ పాలసీ సమీక్షసహా.. ఆర్థిక గణాంకాలు, భారత్‌– యూఎస్‌ వాణిజ్య చర్చలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తదితర పలు కీలక అంశాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు దిక్సూచిగా నిలవనున్నాయి.  ప్రధానంగా చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అధ్యక్షతన యూఎస్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) 28 నుంచి రెండు రోజులపాటు పరపతి సమీక్షను చేపట్టనుంది. 29న తుది నిర్ణయాలు ప్రకటించనుంది.

 సెపె్టంబర్‌లో నిర్వహించిన గత సమావేశంలో ఫెడ్‌.. ఫండ్స్‌ రేట్లను 0.25 శాతంమేర తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 4–4.25 శాతంగా అమలవుతున్నాయి. పలువురు ఆర్థికవేత్తలు తాజా సమీక్షలో మరో పావు శాతం వడ్డీ రేటు కోతను అంచనా వేస్తున్నారు. దీంతో 3.75–4 శాతానికి రేట్లు దిగిరావచ్చని భావిస్తున్నారు. కాగా.. ఈ వారం యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సైతం పాలసీ సమావేశాలు చేపట్టనుండటం గమనార్హం! 

క్యూ2 జాబితాలో 
గత వారాంతాన కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) క్యూ2 ఫలితాలు విడుదల చేయడంతో నేడు ఈ కౌంటర్‌ వెలుగులో నిలవనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. ఈ వారం ఇంధన దిగ్గజం ఐవోసీతోపాటు.. అదానీ ఎనర్జీ, ఇండస్‌ టవర్స్, ఎస్‌ఆర్‌ఎఫ్, టీవీఎస్‌ మోటార్, అదానీ గ్రీన్, టాటా క్యాపిటల్, శ్రీ సిమెంట్స్, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా, హెచ్‌పీసీఎల్, యూబీ, ఐటీసీ, పిడిలైట్, సిప్లా, కెనరా బ్యాంక్, డాబర్‌ ఇండియా, మారుతీ సుజుకీ, బీఈఎల్, శ్రీరామ్‌ ఫైనాన్స్, గోద్రెజ్‌ కన్జూమర్, ఏసీసీ జూలై–సెపె్టంబర్‌ పనితీరు వెల్లడించనున్నాయి.  

గత నెల ఐఐపీ.. 
ఈ నెల 28న సెపె్టంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెల్లడికానున్నాయి. 2025 ఆగస్ట్‌లో ఐఐపీ 4 శాతం పుంజుకుంది. ఇక ఇప్పటికే ప్రారంభమైన యూఎస్, భారత్‌ మధ్య వాణిజ్య సంబంధ చర్చల పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్, వెల్త్‌టెక్‌ సంస్థ ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆర్‌.పొన్మూడి పేర్కొన్నారు. 

వెరసి ఈ వారం మార్కెట్లలో ఫలితాలు, వడ్డీ రేట్ల నిర్ణయాలు, వాణిజ్య చర్చలు తదితరాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ రీసెర్చ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సమీపానికి చేరినట్లు గత వారం చివర్లో వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్న విషయం విదితమే. మరోవైపు వచ్చే వారం నిర్వహించనున్న యూఎస్, చైనా అధినేతల సమావేశంపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. 

ఇతర అంశాలు 
గత వారం రష్యా చమురుపై సరికొత్త ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు జోరందుకున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 98.93కు చేరుకోగా.. బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 65 డాలర్లను తాకింది. ఇవికాకుండా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాలు వంటి అంశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు.

గత వారమిలా
దీపావళి పండుగ సెలవుల నేపథ్యంలో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 260 పాయింట్లు(0.3 శాతం) లాభపడి 84,212 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 85 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 25,795 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.25 శాతం చొప్పున బలపడ్డాయి.  

సాంకేతికంగా..
గత వారం తొలుత బలపడిన మార్కెట్లు తుదకు బలహీనపడ్డాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 85,290 వద్ద గరిష్టానికి చేరి, చివరికి 84,211 వద్ద ముగిసింది. ఈ బాటలో మరింత నీరసిస్తే 83,300–83,000 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. బలాన్ని పుంజుకుంటే స్వల్ప కాలంలో 85,500కు చేరవచ్చు. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 26,100ను అధిగమించినప్పటికీ చివరికి 25,795 వద్ద స్థిరపడింది. ఈ వారం నిఫ్టీకి 25,600–25,400 పాయింట్ల వద్ద సపోర్ట్‌  లభించవచ్చు. ఒకవేళ జోరందుకుంటే 26,100–26,200కు చేరే వీలుంది.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement