ఫలితాలు, ట్రేడ్‌ డీల్స్‌ కీలకం | Stock Market Experts Views and Advice to This Week | Sakshi
Sakshi News home page

ఫలితాలు, ట్రేడ్‌ డీల్స్‌ కీలకం

Nov 3 2025 6:39 AM | Updated on Nov 3 2025 7:53 AM

Stock Market Experts Views and Advice to This Week

ఆర్థిక గణాంకాలకూ ప్రాధాన్యం 

మార్కెట్ల ట్రెండ్‌పై విశ్లేషకులు 

ఈ వారం ట్రేడింగ్‌ 4 రోజులే 

క్యూ2 జాబితాలో దిగ్గజాలు

ఇకపై వడ్డీ రేట్ల కోతకు చెక్‌ పెట్టనున్నట్లు యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు ఇవ్వడంతో గత వారం చివర్లో మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే గత నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు వీడి కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకోవడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం సైతం క్యూ2 ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..
– సాక్షి బిజినెస్‌ డెస్క్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ ఈ వారం నాలుగు రోజులకే పరిమితంకానుంది. గురునానక్‌ జయంతి సందర్భంగా బుధవారం(5న) మార్కెట్లు పనిచేయవు. ఇప్పటికే జోరందుకున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ముగింపునకు రానుంది. ఈ వారం సైతం పలు దిగ్గజాలు జూలై–సెపె్టంబర్‌(క్యూ2) పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో మొబైల్‌ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ, ఆటో దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రాసహా.. అదానీ పోర్ట్స్, టైటన్‌ కంపెనీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్, బజాజ్‌ ఆటో, హిందాల్కో తదితరాలు చేరాయి. దీంతో దిగ్గజాల క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 

పీఎంఐ గణాంకాలు 
దేశీయంగా అక్టోబర్‌ నెలకు హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ గణాంకాలు ఈ వారం వెలువడనున్నాయి. మరోపక్క యూఎస్‌ వ్యవసాయేతర ఉపాధి, తయారీ పీఎంఐ, సర్వీసుల ఐఎస్‌ఎం గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. ఈ వారం మార్కెట్ల ట్రెండ్‌లో గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్, వెల్త్‌ టెక్‌ సంస్థ ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆర్‌.పొన్మూడి తెలియజేశారు. ఈ గణాంకాలతోపాటు యూఎస్‌తో చైనా, భారత్‌ నిర్వహిస్తున్న వాణిజ్య టారిఫ్‌లపై చర్చలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు.   

ఇతర అంశాలు 
దేశీ స్టాక్‌ మార్కెట్లపై క్యూ2 ఫలితాలు, ఆర్థిక గణాంకాలు, వాణిజ్య చర్చలతోపాటు.. పలు ఇతర అంశాలు సైతం ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు వివరించారు. రష్యా చమురుపై యూఎస్‌ ఆంక్షలు, ఒపెక్‌ ఉత్పత్తి ప్రణాళికలు వంటి అంశాలు ముడిచమురు ధరలను ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్‌ డాలరు క్రమంగా బలపడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. డాలరు ఇండెక్స్‌ 99.72ను తాకడం ద్వారా 100కు చేరువైనట్లు తెలియజేశారు. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతోంది. డాలరుతో మారకంలో 89 సమీపానికి నీరసించింది. చమురు ధరలు పుంజుకోవడానికితోడు రూపాయి బలహీనపడితే దిగుమతుల బిల్లు పెరిగి వాణిజ్య లోటు మరింత పెరిగేందుకు దారితీస్తుందని వివరించారు. 

గత వారమిలా 
పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు నికరంగా బలహీనపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 273 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 83,939 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ సైతం 73 పాయింట్ల(0.3 శాతం) నష్టంతో 25,722 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్‌ కొనసాగడంతో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 1 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.7 శాతం పుంజుకుంది.

పెట్టుబడులవైపు ఎఫ్‌పీఐలు
అక్టోబర్‌లో రూ. 14,610 కోట్లు 
గత మూడు నెలలుగా దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెల(అక్టోబర్‌)లో నికర కొనుగోలుదారులుగా యూటర్న్‌ తీసుకున్నారు. వెరసి అక్టోబర్‌లో రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. యూఎస్‌ వడ్డీ రేట్ల కోత అంచనాలు, యూఎస్, భారత్‌ మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు, దేశీ కార్పొరేట్ల పటిష్ట ఫలితాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. 

అంతకుముందు నెల(సెపె్టంబర్‌)లో ఎఫ్‌పీఐలు నికరంగా దేశీ స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ. 23,885 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఆగస్ట్‌లో రూ. 35,000 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు చొప్పున విక్రయాలు చేపట్టారు. అయితే జీఎస్‌టీ సంస్కరణలు తదితర పలు సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్‌పీఐలు గత వారం తిరిగి దేశీయంగా పెట్టుబడుల బాట పట్టినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. ఈ కేలండర్‌ ఏడాది(2025)లో ఇప్పటివరకూ చూస్తే ఎఫ్‌పీఐలు నికరంగా దేశీ స్టాక్స్‌లో రూ. 1.4 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం!

సాంకేతిక అంచనాలివీ
గత వారం కార్పొరేట్‌ ఫలితాలు, జీఎస్‌టీ సంస్కరణలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతపై అంచనాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే ఫెడ్‌ తదుపరి రేట్ల కోతకు చెక్‌ పెట్టనున్నట్లు తాజా పాలసీ సమీక్షలో సంకేతమివ్వడంతో సెంటిమెంటు బలహీనపడింది. వెరసి దేశీ స్టాక్‌ మార్కెట్లు నికరంగా స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే పటిష్ట కార్పొరేట్‌ ఫలితాలు, ప్రోత్సాహకర గణాంకాలు వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నివ్వనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

సాంకేతికంగా చూస్తే నిఫ్టీ ఇటీవల 26,100 పాయింట్ల వద్ద అవరోధాలు(రెసిస్టెన్స్‌) ఎదుర్కొంటోంది. వెరసి 26,000 పాయింట్లకు ఎగువన బలమైన కొనుగోళ్ల మద్దతు లభించడం లేదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా మరోసారి ఈ  స్థాయిలో బలహీనపడితే.. 25,600 దిగువకు చేరవచ్చని తెలియజేశారు. 25,400–350 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఇక సెన్సెక్స్‌ సైతం 85,100 పాయింట్ల నుంచి వెనకడుగు వేసింది. అయితే మరోసారి 85,000 స్థాయిని అధిగమించేందుకు వీలుంది. ఒకవేళ బలహీనపడితే సమీప భవిష్యత్‌లో 83,300–83,000 పాయింట్లకు చేరవచ్చు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement