దేశ, విదేశీ గణాంకాలు కీలకం
ఫెడ్ మినిట్స్‌కు ప్రాధాన్యం
ఆటుపోట్లున్నా ముందుకే!
ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా
దేశీయంగా ఆర్థిక గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమీక్షా సంబంధ వివరాలు(మినిట్స్) ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటికితోడు యూఎస్‌తో వాణిజ్య టారిఫ్‌లపై చర్చల పురోగతి సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య మరింత బలపడవచ్చని భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను దేశ, విదేశీ గణాంకాలతోపాటు పలు ఇతర అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రధానంగా యూఎస్‌తో వాణిజ్య టారిఫ్‌లపై చర్చల పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అత్యధికకాలం కొనసాగిన యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్‌కు గత వారాంతాన ముగింపు పలకడం ప్రోత్సాహకర అంశమని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక(జూలై–సెప్టెంబర్) ఫలితాలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యవస్థాగత సానుకూలతలు, పటిష్ట ఫండమెంటల్స్ కలిగిన రంగాలవైపు ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. దీంతో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్ 2025–మార్చి2026)లో అప్‌గ్రేడ్‌కు వీలున్న రంగాలవైపు పోర్ట్‌ఫోలియోల సవరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. క్యాపిటల్ మార్కెట్ సంబంధిత స్టాక్స్ వెలుగులో నిలవనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు. ఇందుకు రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, సిప్ పెట్టుబడులు, ఐపీవోల హవా దోహదపడనున్నట్లు వివరించారు.
బీహార్ ఎఫెక్ట్
దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండటానికితోడు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ విస్పష్ట మెజారిటీ సాధించడం సానుకూల అంశాలుగా నిపుణులు పేర్కొన్నారు. క్యూ2లో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌సహా పలు రంగాల దిగ్గజాలు ఆశావహ ఫలితాలు సాధించడం సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. పండుగులు, పెళ్ళిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్‌కు వీలున్న రంగాలు పెట్టుబడులను ఆకట్టుకోవచ్చని ఖేమ్కా ప్రస్తావించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పెట్టుబడులు పుంజుకునే వీలున్నట్లు అంచనా వేశారు. టెక్నాలజీ, మెటల్ రంగాలు పుంజుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
వాణిజ్య గణాంకాలు
వారాంతాన దేశీయంగా అక్టోబర్ నెల ఎగుమతి, దిగుమతి గణాంకాలు విడుదలకానున్నాయి. 2025 సెప్టెంబర్‌లో ఎగుమతులకంటే దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 32.15 బిలియన్ డాలర్లకు చేరింది. ఇవికాకుండా తయారీ, సర్వీసెస్ తదితర పీఎంఐ ఇండెక్సులు విడుదలకానున్నాయి. ఇప్పటికే రిటైల్ ధరలు, టోకు ధరల ద్రవ్యోల్బణం భారీగా వెనకడుగు వేయడంతో ఆర్‌బీఐ చేపట్టనున్న డిసెంబర్ పాలసీ సమీక్షపై సానుకూల అంచనాలకు వీలున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్ల కోతసహా.. ధరలు దిగిరావడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్‌వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు.
గత వారమిలా
పలు ఆటుపోట్ల మధ్య గత వారం(10–14) దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. వెరసి రెండు వారాల నష్టాలకు చెక్ పెట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ నికరంగా 1,347 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 84,563 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 418 పాయింట్లు(1.6 శాతం) లాభపడి 25,910 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 0.9 శాతం జంప్‌చేయగా.. స్మాల్‌క్యాప్ 0.15 శాతమే బలపడింది.
విదేశీ అంశాలు
గత పాలసీ సమీక్షా వివరాల(మినిట్స్)ను యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారం వెల్లడించనుంది. అంతేకాకుండా ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పరపతి విధానాలపై ప్రసంగించనున్నారు. గత నెలలో నిర్వహించిన పరపతి సమావేశంలో ఫెడ్ కమిటీ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి దిగివచ్చాయి. మరోవైపు చైనా ఎఫ్‌డీఐలు, వడ్డీ రేట్ల వివరాలు, యూఎస్ తయారీ, హౌసింగ్ తదితర గణాంకాలు సైతం ఈ వారం వెల్లడికానున్నాయి. కాగా.. అక్టోబర్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు చేపట్టినప్పటికీ తిరిగి ఈ నెలలో అమ్మకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు నాయిర్ తెలియజేశారు. ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం తదితర అంశాలు సైతం కీలకమేనని విశ్లేషకులు ప్రస్తావించారు.
సాంకేతికంగా..
గత వారం నికరంగా మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ బాటలో మరింత బలపడేందుకు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బలహీనపడితే తొలుత 25,750 వద్ద, తదుపరి 25,500 వద్ద మద్దతు లభించవచ్చు. ఆపై 26,300–26,800వరకూ పురోగమించే వీలుంది. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ తొలుత 84,000 వద్ద, ఆపై 83,600 వద్ద మద్దతు కూడగట్టుకోవచ్చు. తదుపరి బలపడితే 85,500–85,600 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.


