టైటిల్: వృషభ
నటీనటులు: మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, అజయ్ తదితరులు
దర్శకత్వం: నందకిశోర్
విడుదల తేదీ..డిసెంబర్ 25, 2025
మలయాళ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ ఏడాది తుడురమ్, ఎంపురాన్-2, హృదయపూర్వం చిత్రాలతో అలరించారు. తాజాగా మోహన్ లాల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓకేసారి తెలుగు, మలయాళ భాషల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
వృషభ కథేంటంటే..
గత జన్మలు కూడా ఉన్నాయని మనందరం వింటుంటాం. అయితే ఆ జన్మలో మనం ఎలా పుట్టాం.. అసలేం జరిగింది కేవలం ఊహాజనితమే. అసలు గత జన్మలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అయితే ఆ రెండు జన్మలను ఓకేసారి చూపిస్తూ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందించే చిత్రమే మోహన్ లాల్ వృషభ.
ఈ కథ రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు ఓ మహిళ పెట్టే శాపంతో మొదలవుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనలతో ఈ కథను ప్రారంభించాడు. బిజినెస్లో ఆదిదేవ వర్మ(మోహన్ లాల్) కింగ్. ప్రతి ఏడాది ఉత్తమ బిజినెస్మెన్గా అవార్డ్ ఆయనకు రావాల్సిందే. అలా ఇది నచ్చని మరో వ్యాపారవేత్త అవార్డ్ బహుకరించే రోజే ఆదిదేవ వర్మపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆది దేవ వర్మ కుమారుడు తేజ్(సమర్జీత్ లంకేశ్) ఎంట్రీతో ఆ ప్లాన్ తిప్పికొడతాడు. అలా వర్తమానంలో తండ్రీ, తనయులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తేజ్ పెళ్లి చేసుకోవాలనేది తండ్రి బలమైన కోరిక. ఈ విషయాన్ని పదే పదే తన కొడుకుతో చెబుతుంటాడు.
అదే సమయంలో గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం మంచి సైక్రియాటిస్ట్ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరతారు. నాన్నకు ఉన్న ప్రాబ్లమ్ గురించి ఇంట్లో పనిచేసే వంటమనిషి పప్పు.. తేజ్‌తో ఓ ఆసక్తికర విషయం చెబుతాడు. ఇది విన్న తేజ్ తండ్రికి చెప్పకుండానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయల్దేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు తేజ్ ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? తండ్రి కోసం వెళ్లిన తేజ్ ఎందుకలా మారిపోయాడు. అసలు తండ్రీ, కొడుకుల మధ్య ప్రతీకారానికి కారణమేంటి? ఆది దేవ వర్మకు గత జన్మలో అసలేం జరిగింది? ఆ జ్ఞాపకాలు ఇంకా ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు ఆ మహిళ పెట్టిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే వృషభ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మామూలుగా గత జన్మలో ఏం జరిగింది అనేది మొదట చూపించి కథను మొదలెడతాం. అలానే గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు జరిగిన సంఘటనలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ అసమాన యోధుడిగా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు అయితే వృషభ చేసిన పొరపాటు వల్ల ఓ మహిళ ఆయనకు శాపం పెడుతుంది. అదే శాపం వర్తమానంలోనూ ఆదిదేవ వర్మ(మోహన్ లాల్)ను వెంటాడుతుంది. అయితే కుమారుడి కోసం తాపత్రయ పడుతున్న ఆదిదేవకు..
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ పాతదే కావొచ్చు. కానీ స్క్రీన్ ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. తాను అనుకున్నట్లుగానే కథను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ప్రారంభంలోనే రాజుకు పెట్టే శాపం రివీల్ చేసి ఆసక్తి క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వర్తమానంలోకి తీసుకెళ్లాడు. తండ్రి, కుమారుల మధ్య బాండింగ్.. కొడుకు కోసం తండ్రి.. తండ్రి కోసం కుమారుడు పడే తపన చూపించాడు. అమ్మాయితో పరిచయం కావడం.. వెంటనే ఇద్దరి మధ్య లవ్.. చకాచకా ఓకే చెప్పడం.. అలా కథను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్ హాప్ మొత్తం ఆదిదేవ వర్మ(మోహన్ లాల్), సమర్జీత్ లంకేశ్(తేజ్)ల బాండింగ్.. దామినితో లవ్లో పడడం అంతా రోటీన్‌గా సాగుతుంది. తేజ్ ఎప్పుడైతే తండ్రి సొంత గ్రామమైన దేవనగరి గ్రామానికి వెళ్లాడో అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్లో కథ ప్రేక్షకుడి ఊహకందేలానే సాగుతుంది. కానీ అలా ప్రేక్షకుడు కథలో లీనమవ్వగానే.. ఇంటర్వెల్కు ముందు ఇచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేరు. ఆ బిగ్ ట్విస్ట్ థియేటర్లో చూసి సగటు ప్రేక్షకుడు షాకవ్వాల్సిందే. అలా ప్రథమార్థాన్ని వర్తమానంతోనే ముగించాడు.
సెకండాఫ్లో గత జన్మలో జరిగిన పరిణామాలు.. రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) త్రిలింగ రాజ్యం గురించే ఉంటుంది. ఆ రాజ్యంలో జరిగే సంఘటనలు చుట్టే తిరుగుతుంది. కానీ త్రిలింగ రాజ్యంలోని స్ఫటిక లింగం దొంగతనం చేసేందుకు వచ్చిన హయగ్రీవా(సమర్జీత్ లంకేశ్) వస్తాడు. ఆ తర్వాత వృషభ రాజుకు.. హయగ్రీవాకు మధ్య జరిగే పోరాటం సెకండాఫ్లో హైలెట్. ఆ యుద్ధ ఫైట్ సీన్‌లో జరిగిన సంఘటన తర్వాతే ఈ కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సెకండాఫ్లో అలీ కామెడీ కొద్దిసేపే అయినా నవ్వులు తెప్పించింది. ఇందులో గత జన్మకు.. వర్తమానానికి ముడిపెట్టడం వల్ల ప్రేక్షకుడిని కాస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. గత జన్మ కాన్సెప్ట్తో వచ్చిన ఈ కథలో క్లైమాక్స్లో ఫుల్ ఎమోషన్ క్రియేట్ చేశాడు. తండ్రీ, తనయుల మధ్య పోరాటాన్ని భావోద్వేగానికి ముడిపెడుతూ మలిచిన తీరు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఈ కథలో ప్రేక్షకుడి ఊహకందని బిగ్ ట్విస్ట్‌లు ఇచ్చాడు డైరెక్టర్. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్, స్క్రీన్ ప్లేతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. ఆడియన్స్కు ఎక్కడా బోరింగ్ అనిపించకుండా కథను ముందుకు తీసుకెళ్లడం ప్లస్. భారీ ఫైట్స్ లేకున్నా..కథకు తగినట్లుగా ప్లాన్ చేశాడు.
ఎవరెలా చేశారంటే..
మోహన్ లాల్ ఆదిదేవ వర్మగా, రాజా విజయేంద్ర వృషభగా రెండు పాత్రల్లో తనలోని టాలెంట్తో ఆకట్టుకున్నారు. సమర్జీత్ లంకేశ్ యంగ్ హీరోగా అదరగొట్టేశాడు. గత జన్మ హయగ్రీవా పాత్రలో డిఫరెంట్గా కనిపించాడు. నయన సారిక తన గ్లామర్తో ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బీజీఎం అంత కాకపోయినా ఫర్వాలేదనిపించింది. సామ్ సీఎస్ నేపథ్యం సంగీతం బాగుంది. కృతి మహేశ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా గ్రాండ్గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే వృషభ చూడాల్సిందే.


