రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 5న జరగబోయే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆహార ధరల పతనం, ఇటీవల వినియోగ వస్తువులపై ప్రకటించిన పన్ను తగ్గింపుల కారణంగా ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో వినియోగానికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ రేటు తగ్గిస్తుందని భావిస్తున్నారు.
రికార్డు కనిష్టానికి ద్రవ్యోల్బణం
అక్టోబర్‌లో భారతదేశ వినియోగదారుల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి చేరుకుంది. ఇది సెంట్రల్ బ్యాంక్‌కు రేట్ల తగ్గింపునకు అవకాశం ఇస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 89.49 వద్ద కొత్త కనిష్టాన్ని తాకినప్పటికీ, దేశీయంగా బలహీనపడుతున్న డిమాండ్‌ను పెంచేందుకు ఆర్‌బీఐ మొగ్గు చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన ఆర్థిక గణాంకాలు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఇంకా ఉందని సూచించాయని పేర్కొన్నారు. ఏడాది మొదటి అర్ధభాగంలో 100 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఆర్‌బీఐ ఆగస్టు నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది.
ఆర్థికవేత్తల అంచనాలు
నవంబర్ 18-26 మధ్య నిర్వహించిన రాయిటర్స్ పోల్‌లో 18 మంది ఆర్థికవేత్తలు ఆర్‌బీఐ తన డిసెంబర్ 3-5 పాలసీ సమావేశం ముగిసే సమయానికి రెపో రేటును 5.25 శాతానికి తగ్గిస్తుందని అంచనా వేశారు. మరో 18 మంది మాత్రం ఎలాంటి మార్పు ఉండదని భావించారు. డ్యూయిష్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ ‘2025-2026 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాను మరింత సవరించే అవకాశం ఉన్నందున 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు ఉంటుందనే అంచనాలున్నాయి’ అన్నారు.
ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?


