గణాంకాలు, ఫలితాలే దిక్సూచి | Expert analysis on domestic stock markets | Sakshi
Sakshi News home page

గణాంకాలు, ఫలితాలే దిక్సూచి

Nov 10 2025 3:07 AM | Updated on Nov 10 2025 3:07 AM

Expert analysis on domestic stock markets

క్యూ2 జాబితాలో పలు దిగ్గజాలు 

ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు ప్రాధాన్యం 

యూఎస్‌తో వాణిజ్య చర్చలపై దృష్టి 

దేశీ స్టాక్‌ మార్కెట్లపై నిపుణుల విశ్లేషణ

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు ప్రధానంగా ఆర్థిక గణాంకాలు, జూలై–సెప్టెంబర్ (క్యూ2) ఫలితాలు దిశా నిర్దేశం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు యూఎస్‌తో చైనా, ఇండియా వాణిజ్య చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

దేశీయంగా ఈ వారం పలు ఆర్థిక గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌ నెలకు బుధవారం(12న) వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), శుక్రవారం(14న) టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. అంతకుముందు నెల(సెప్టెంబర్‌)లో సీపీఐ 2.07 శాతం నుంచి 1.54 శాతానికి దిగివచి్చంది. ఇది 2017 జూన్‌ తదుపరి కనిష్టంకాగా.. ఆర్‌బీఐ 2 శాతం లక్ష్యానికంటే తక్కువకావడం గమనార్హం! ఇక సెప్టెంబర్ లో డబ్ల్యూపీఐ 0.52 శాతం నుంచి 0.13 శాతానికి బలహీనపడింది. ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్‌బీఐ పరపతి విధానాలపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

క్యూ2 పనితీరు.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాల సీజన్‌ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, హిందుస్తాన్‌ కాపర్‌తోపాటు టాటా స్టీల్, ఏషియన్‌ పెయింట్స్, బజాజ్‌ ఫైనాన్స్, భారత్‌ ఫోర్జ్, బయోకాన్, కంకార్, ఫినొలెక్స్‌ కేబుల్స్, టాటా పవర్, థెర్మాక్స్, ఇమామీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్, గ్రాఫైట్, హడ్కో, కల్పతరు, కేఈసీ ఇంటర్నేషనల్, కేపీఐటీ టెక్, అశోక్‌ లేలాండ్‌ తదితరాలు క్యూ2 పనితీరు ప్రకటించనున్నాయి. ద్రవ్యోల్బణ గణాంకాలుసహా క్యూ2 ఫలితాలు మార్కెట్లలో కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా తెలియజేశారు.  

విదేశీ అంశాలు 
కొద్ది రోజులుగా కొనసాగుతున్న యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ ఆ దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు.. ఇతర దేశాలపైనా ప్రభావం చూపనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోపక్క యూఎస్‌తో చైనా, భారత్‌ నిర్వహిస్తున్న వాణిజ్య చర్చలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ వారం అక్టోబర్‌ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్‌ విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. అక్టోబర్‌ నెలకు యూఎస్‌ వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వెల్లడికానుంది. ఈ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్, వెల్త్‌ టెక్‌ సంస్థ ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆర్‌.పొన్మూడి పేర్కొన్నారు. 

ఇతర అంశాలకూ ప్రాధాన్యం 
ఇటీవల ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. వీటితోపాటు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, స్టాక్స్‌లోదేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా అమ్మకాల తీరు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావంసహా.. చైనా, భారత్‌తో ట్రంప్‌ వాణిజ్య చర్చలు మార్కెట్లలో ట్రెండ్‌కు కీలకంకానున్నట్లు తెలియజేశారు.  

గత వారమిలా 
గురునానక్‌ జయంతి సందర్భంగా బుధవారం(5న) సెలవుకావడంతో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేశాయి. పలు ఆటోపోట్ల మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 722 పాయింట్లు(0.9 శాతం) నీరసించి 83,216 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 230 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 25,492 వద్ద స్థిరపడింది. 
అయితే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ దాదాపు యథాతథంగా ముగిసింది. 

సాంకేతికంగా 
గత వారం సాంకేతికంగా మార్కెట్లు దిద్దుబాటు బాటలో సాగాయి. అయితే ఈ వారం క్షీణతకు కొంతమేర అడ్డుకట్టపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో నష్టాలు పరిమితంకావచ్చని పేర్కొన్నారు. నిఫ్టీకి తొలుత 25,350 పాయింట్ల వద్ద, తదుపరి 25,230 వద్ద మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఈ స్థాయిల నుంచి బలాన్ని పుంజుకుంటే తొలుత 25,700, తదుపరి 25,800 వరకూ బలపడవచ్చని తెలియజేశారు. సెన్సెక్స్‌ బలహీనపడితే తొలుత 82,500 పాయింట్లవద్ద, ఆపై 82,000 స్థాయిలో సపోర్ట్‌ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఈ స్థాయిలో బలపడితే 84,500– 85,000 పాయింట్ల వరకూ పుంజుకోవచ్చని అంచనా వేశారు.

మళ్లీ ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 12,569 కోట్లు వెనక్కి 
గత నెల చివరిలో దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి ప్రదర్శించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తిరిగి ఇటీవల అమ్మకాల బాట పట్టారు. వెరసి ఈ నెల(నవంబర్‌)లో ఇప్పటివరకూ రూ. 12,569 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి అక్టోబర్‌లో నికరంగా రూ. 14,610 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే అంతకుముందు మూడు నెలలపాటు వరుసగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు.

ఫలితంగా సెప్టెంబర్ లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్‌లో రూ. 34,900 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెలలో ప్రతీ ట్రేడింగ్‌ రోజున నికరంగా అమ్మకాలకే మొగ్గు చూపడం గమనార్హం! దీంతో ఇతర మార్కెట్లతో పోలిస్తే దేశీ స్టాక్స్‌ వెనకడుగులో ఉన్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ తెలియజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement