క్యూ2లో అత్యధికంగా 375 వాహనాల డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్ గ్రూప్‌లో భాగమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 656.62 కోట్ల ఆదాయం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 523.70 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 25 శాతం అధికం. లాభం రూ. 47.65 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ. 49.43 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో 375 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివర్ చేశామని, వీటిలో 25 ఎలక్ట్రిక్ టిప్పర్లు కూడా ఉన్నాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ మహేష్ బాబు చెప్పారు. ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికమని వివరించారు.
కంపెనీ ఇప్పటివరకు 3,254 వాహనాలను అందించింది. 9,818 వాహనాలకి ఆర్డర్లతో భవిష్యత్ వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నట్లు మహేశ్ బాబు చెప్పారు. నిర్వహణ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టడమనేది ఇటు ఆదాయం, లాభదాయకత వృద్ధికి దోహదపడినట్లు తెలిపారు. అటు దేశీయంగా ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్లో తొలిసారిగా తమ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌కి సరి్టఫికేషన్ లభించినట్లు వివరించారు. వచ్చే త్రైమాసికం నుంచి ఈ టెక్నాలజీతో బస్సుల తయారీ ప్రారంభమవుతుందని మహేశ్ బాబు తెలిపారు. అర్థ సంవత్సరానికి గాను కంపెనీ ఆదాయం రూ. 837.61 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ. 1,003.85 కోట్లకు చేరింది. లాభం రూ. 71.91 కోట్ల నుంచి 5 శాతం పెరిగి రూ. 75.46 కోట్లకు చేరింది.


